గంజాయి కేసును ఛేదించిన పోలీసులు

కేసు వివరాలు వెల్లడిస్తున్న చింతూరు సిఐ గజేంద్ర

ప్రజాశక్తి-మోతుగూడెం

అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు మండలం, మోతుగూడెంలోని ఐఎన్‌టియుసి 327 యూనియన్‌ కార్యాలయంలో ఈ నెల 17న పట్టుబడిన 5.3 కేజీల గంజాయి కేసును పోలీసులు చేధించారు. ‘మలుపు తిరుగుతున్న మోతుగూడెం గంజాయి కేసు’ శీర్షికన ఈ నెల 21న ప్రజాశక్తి ప్రచురించిన వార్తకు స్పందించిన పోలీసు యంత్రాంగం కేసు దర్యాపు వేగవంతం చేసింది. ఈ మేరకు మోతుగూడెం పోలీసు స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను ప్రవేశ పెట్టి కేసు వివరాలను చింతూరు సిఐ గజేంద్ర, మోతుగూడెం ఎస్‌ఐ గోపాలరావు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం…. ఐఎన్‌టియుసి 327 యూనియన్‌ ఆఫీసులో గంజాయి ఉందని ఈ నెల 17న 1104 యూనియన్‌కు చెందిన సూరినీడు నాయుడు మోతుగూడెం ఎస్సైకి సమాచారం ఇచ్చారు. దీంతో 327 యూనియన్‌ ఆఫీసును తనిఖీ చేయగా 5.3 కేజీలు గంజాయి పట్టుబడింది. దీని మీద కేసు నమోదు చేసి, చింతూరు సిఐ దర్యాప్తు చేపట్టగా, పలు ఆసక్తికర విషయాలను వెలుగుచూశాయి. 1104 యూనియన్‌కి చెందిన సూరినీడు నాయుడుకు, 327 యూనియన్‌కు చెందిన రీజనల్‌ సెక్రటరీ పి.ఆనందబాబు మధ్య పలు విషయాల్లో వివాదాలు ఉన్నాయి. నాయుడును 2020లో ఎస్టీ, ఎస్సీ కేసులో ఆనంద్‌, వారి యూనియన్‌ వ్యక్తులు ఇరికించారు. అలాగే 2019-2020 మధ్య నాయుడు విద్యా అర్హతల మీద డిపార్ట్మెంటల్‌ ఎంక్వైరీ వేయించి 3 ఇంక్రిమెంట్స్‌ పోయేట్టు చేశారు. ఆరు నెలల క్రితం నాయుడు మోతుగూడెం నుండి ఫోర్‌ బే డివిజన్‌కి ట్రాన్స్‌ఫర్‌ కావడంలో ఆనంద్‌, ఆయన అనుచరులు పాత్ర ఉందని అనుమానంతో ఆనంద్‌, ఆయన అనుచరులపై నాయుడు కోపం పెంచుకున్నాడు. అలాగే 1104 యూనియన్‌కి చెందిన బండారు రాజేష్‌ గతంలో 327 యూనియన్‌లో ఉన్నప్పుడు రీజనల్‌ సెక్రటరీ పదవి నుండి ఆనంద్‌, ఆయన అనుచరుల వలనే తొలగింపబడ్డారని ఆయన కోపంతో ఉన్నాడు. 327 యూనియన్‌కి చెందిన కాళ్ల రామకృష్ణకి కూడా తమ యూనియన్‌కి చెందిన ఆనంద్‌, ఆయన అనుచరుల మీద పలు విషయాలలో అభిప్రాయభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సూరినీడు నాయుడు, బండారు రాజేష్‌ రామకష్ణలు ఆనంద్‌, ఆయన అనుచరుల మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కాళ్ళ రామకృష్ణ 327 యూనియన్‌ ఆఫీస్‌ తాళాలను పి.శ్రీను దగ్గర తీసుకొని బండారు రాజేష్‌కి ఇచ్చారు. బండారు రాజేష్‌ ఆ తాళాలను నాయుడుకు ఇచ్చారు. నాయుడు పోల్లూరుకు చెందిన రవి దగ్గర సుమారు 5 కేజీల గంజాయిని రూ.4వేలకు కొనుగోలు చేసి దానిని 327 యూనియన్‌ ఆఫీసులో పెట్టి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసు కేసు దర్యాప్తులో ఈ కుట్రను ఛేదించారు. నిందితులు సూరినీడు నాయుడు, బండారు రాజేష్‌, కాళ్ల రామకష్ణ, గంజాయి విక్రయించిన రవిని పోలీసులు అరెస్టు చేసి సోమవారం కోర్టుకు తరలించారు.

➡️