ప్రజాశక్తి-కొండాపురం (కడప) : గండికోట ముంపు వాసులకు పరిహారం చెల్లించాలంటూ … గ్రామస్తులు ఎంపి అవినాష్ రెడ్డికి సోమవారం వినతిపత్రాన్ని సమర్పించారు.
గండికోట ప్రాజెక్టులో ముంపునకు గురైన పి.అనంతపురం గ్రామానికి 10 లక్షల రూపాయల పరిహారంతోపాటు గండికోట ప్రాజెక్టు లో మొదటి విడత ముంపునకు గురైన 14 గ్రామాలవారికి సిఎం జగన్మోహనరెడ్డి ప్రకటించిన అదనపు పరిహారం 3.25 లక్షలు రూపాయలు వెంటనే చెల్లించాలని వైసిపి మండల కన్వీనర్ వెంగళ జగదీశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ముంపువాసులు సోమవారం కడప యంపి వైయస్.అవినాష్ రెడ్డిని కోరారు. గండికోట ప్రాజెక్టు ముంపువాసులకు జీవనోపాధి లేకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ముంపువాసులు అప్పులు చేస్తూ జీవిస్తున్నారని అందువలన వారికి వెంటనే రూ.3.25 లక్షలు చెల్లించి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని వైసిపి మండల కన్వీనర్ జగదీశ్వర రెడ్డి, అనంతపురం పెద్దిరెడ్డి, గండ్లూరు బాలనాగిరెడ్డి, ఓబన్నపేట ప్రతాపరెడ్డి, చౌటిపల్లె వెల్లాల రామలింగేశ్వరరెడ్డితోపాటు ముంపువాసులు కలిసి వినతిపత్రాలను అందించారు. గండికోట ముంపువాసులందరికి త్వరలో పూర్తిపరిహారం చెల్లిస్తామని యంపి అవినాష్ రెడ్డి తెలిపారు.