ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమం పాఠశాలలో కనిగిరి మండల న్యాయ సేవాధికార సంస్థ, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపాలిటీ చైర్మన్, న్యాయవాది షేక్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ 1948 డిసెంబర్ 10వ తేదీన ఏర్పడిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ‘అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందం’ తీర్మానం చేసినట్లు తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణ, హక్కుల అణచివేత లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం సాగాల్సిన కృషికి గుర్తుగా డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలిపారు. మనుషులందరికీ పుట్టుకతోనే స్వేచ్ఛ, స్వీయ భద్రత, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుగా ఉంటాయని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానులేనని పేర్కొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు పాశం పిచ్చయ్య మాట్లాడుతూ మానవ హక్కులను ఉల్లంఘిం చిన వారికి చట్ట ప్రకారం శిక్ష పడుతుందని అన్నారు. భ్రూణహత్యలు, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, దళితులపై దాడులు జరగకుండా అడ్డుకున్నప్పుడే మానవ హక్కులను పరిరక్షించినట్లవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం, సమాజంలో జీవించే హక్కులే మానవ హక్కులని తెలిపారు. ఈ హక్కులను స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా సమాజంలో అట్టడుగున ఉన్న పేద, బలహీనవర్గాలకు ప్రయోజనం కల్పించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ, విద్యా హక్కు, జీవించే హక్కు, రక్షణ హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్యపు హక్కులపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రవిచంద్ర, న్యాయవాది షాహిద్, పారా లీగల్ వాలంటీర్ గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ మండ్రు రమేష్ బాబు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
