ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : వైసిపిలో జంబ్లింగ్ విధానం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్పు చేసి పలు నియోజకవర్గాల్లో కొత్త వారిని రంగంలోకి తేవాలనే వైసిపి అధిష్టానం ప్రయత్నంపై భిన్న స్వరాలు విన్పిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత నిరోధించడానికి జంబ్లింగ్ విధానాన్ని ఆ పార్టీ ఎంచుకుంది. ఈ విధానం వల్ల ఎంత లాభమో అంతే నష్టం కూడా ఉంటుందని వైసిపి సీనియర్‌లు అభిప్రాయపడుతున్నారు. ఒకచోట చెల్లని కాసు మరోచోట చెల్లుతుందా? అని టిడిపి నాయకులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఓటమి భయంతోనే ఒకచోట నుంచి మరొక చోటికి వెళ్తున్నారని కూడా టిడిపి విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు టిక్కెట్ రాని వారు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి, వైసిపికి రాజీనామా చేసి హైదరాబాద్ వెళ్లిపోయారు. కొద్దిరోజులు జిల్లా రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారని అనుచరులు చెబుతున్నారు. మంగళగిరి వైసిపి ఇన్‌ఛార్జిగా గంజి చిరంజీవిని ప్రకటించడంతో ఆర్‌కె గ్రూపు అంతా మౌనంగా ఉన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా నియమితులైన మంత్రి విడదల రజిని స్థానికంగా వైసిపి సీనియర్ నాయకులను కలిసి వారి సహకారాన్ని కోరుతున్నారు. స్థానిక అధికార యంత్రాంగంతో మంత్రాంగం చేస్తున్నారు. ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌కు ఇంకా ప్రత్యామ్నాయం చూపలేదు. ఆయన అనుచరులు అయోమయంలో ఉన్నారు. పొన్నూరులో ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు ఈసారి అవకాశం లేదని పార్టీ అధినేత తరుపున కొంతమంది అగ్రనాయకులు చెప్పినట్టు తెలిసింది. కొంతకాలంగా రోశయ్య నియోజకవర్గంతో అంటీముట్టన్నట్టు ఉంటున్నారు. ఆయన స్థానంలో ఇంత వరకు సరైన అభ్యర్థిని ఎంపిక చేయలేదు. సత్తెనపల్లి ప్రాంతంలో అనేక వివాదాలలో ఉన్న వ్యక్తిని పొన్నూరు అభ్యర్థిగా ఎంపిక చేస్తే వైసిపి గెలుపు కంటే టిడిపికి మేలు చేసినట్టు అవుతుందనే వాదన ఆ పార్టీ సీనియర్‌ల నుంచి వినిపిస్తోంది. ఎంపి అయోధ్యరామిరెడ్డి కుటుంబంలో మంగళగిరి నుంచి ఆర్‌కెకు అవకాశం ఇవ్వకపోవడం వల్ల మాజీ ఎంపి మోదుగుల వేణుగోపాలరెడ్డికి పల్నాడులో ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయించాలని సిఎం జగన్ నిర్ణయించారని ప్రచారం జరుగుతోంది. మంత్రి అంబటి రాంబాబును వేరే నియోజకవర్గానికి పంపితే సత్తెనపల్లిలో మోదుగులకు అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు. గురజాల నుంచి తానే పోటీ చేస్తానని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ప్రకటించారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిని నర్సరావుపేటకు పంపి మోదుగులకు గురజాల ఇవ్వనున్నారు. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డిని సత్తెనపల్లికి మారుస్తారనే ప్రచారం కూడా ఉంది. మొత్తంగా పల్నాడులో మూడు నియోజకవర్గాలకు అభ్యర్థుల మార్పు ఖాయంగా ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. చిలకలూరిపేటలో ఇప్పటికే మంత్రి రజినీని మార్పు చేసి మల్లెల రాజేష్‌కు అవకాశం కల్పించడంపై కొన్ని తరగతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నూరుబాషాలకు ఇక్కడ అవకాశం ఇస్తారని ప్రచారమైంది. దీంతో నూరుబాషాలను టిడిపి నాయకులు తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 8 నియోజకవర్గాల్లో జంబ్లింగ్ విధానం పాటించగా మరో ఐదు నియోజకవర్గాల్లో ఈ మార్పు తప్పదని తెలుస్తోంది.
