ప్రజాశక్తి – కడప అర్బన్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి ప్రజా రంజక పాలన చేస్తారని ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే, పరిపాలన అవగాహన రాహిత్యంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. జియాన్ వ్యాయామ కళాశాలలో ఆదివారం టిడిపి న్యాయవిభాగం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఎస్ మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయవాదుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే, ప్రతిపక్షాలను లేకుండా చేయాలని, టిడిపి నాయకులను ఆక్రమ అరెస్టులతో జైళ్లకు పంతున్నారని పేర్కొన్నారు. టిడిపి హయాంలో స్కిల్ డెవలప్మెంట్‌లో అవినీతి జరిగిందని టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును అక్రమ అరెస్టుతో జైలుకు పంపితే, న్యాయస్థానాల్లో వైసిపి ప్రభుత్వ దుర్మార్గాన్ని న్యాయవాదులు తిప్పి కొట్టారని చెప్పారు. రాజ్యాంగాన్ని అమలు పరిచే వారే న్యాయ వాదులని, ధర్మం, న్యాయం ఉండబట్టే చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వచ్చారన్నారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్ల చెల్లింపులకు గతిలేక, అప్పులు చేసే దౌర్భాగ్య స్థితికి రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం తీసుకు వచ్చిందని విమర్శించారు. ఒకపక్క కరువు, మరో పక్క తుపాన్ వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదన్నారు. ముందస్తుగా తుపసాన్ పరిస్థితులను ఎదుర్కొనే పరిజ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. రాష్ట్ర విభజనతో రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు లోటును అధిగమించి, రాష్ట్రాన్ని అభివద్ధిలో పరుగులు చేయించారని ఆయన చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. ప్రతి ఒక్క న్యాయవాది టిడిపి గెలుపునకు రెడ్డప్ప గారి మాధవికి విజయం చేకూర్చాలని ఆయన న్యాయవాదులను కోరారు. కడప నియోజకవర్గ టిడిపి ఇన్చఆర్జిరెడ్డప్ప గారి మాధవి మాట్లాడుతూ టిడిపి హయాంలో, ఇప్పటి వైసిపిలో కుటుంబ ఆర్థిక పరిస్థితికి ఎంతో వ్యత్యాసం ఉందని చెప్పారు. వైసిపి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, రకరకాల పన్నుల భారాన్ని ప్రజల పై పెనుబారం మోపిందని తెలిపారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలని, చంద్రబాబు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, సబ్సిడీ రుణాలు అందివ్వడంతోపాటు, నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించారని ఆమె గుర్తు చేశారు. విదేశీ విద్యకు ఆర్థిక సాయం అందించిన ఘనత చంద్రబాబుదే అన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశం సంక్షేమ పథకాలు నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఒక్క రోడ్డు సౌకర్యంగా లేదని, కనీసం డ్రెయినేజీ లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని వాపోయారు. బాధ్యతారహితంగా పాలకులు వ్యవహరిస్తే, ఇంటికి సాగనంపడం ఖాయమని ఆమె హెచ్చరించారు. ముందుగా అక్కడికి చేరుకున్న శ్రీనివాసరెడ్డి, మాధవికి ఘనస్వాగతం పలికి, దశ్యాలు వా కప్పి పూలమాలలు వేసి న్యాయవాదులు సత్కరించారు. ఆత్మీయ సమావేశంలో మాజీ జిపి గుర్రప్ప, శివ శంకర్ రెడ్డి, జింక సుబ్బరాయుడు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
