జొన్న, మొక్కజొన్నపై రైతుల దృష్టి

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : రబీ సాగులో వ్యవసాయ శాఖ వద్దని చెప్పినా జొన్న, మొక్కజొన్న సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఖరీఫ్‌లో సాగు చేసిన వరి కోతల అనంతరం ప్రతి ఏటా రబీలో ఈ పంటలను సాగు చేస్తారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ముగిసే సమయంలో తీవ్ర వర్షాభావం ఏర్పడటం, అక్టోబరు మొత్తం వర్షాల్లేకపోవడం, 21 రోజుల పాటు వేడిగాలలు వీయడం, నాగార్జున సాగర్‌, పులిచింతల జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడం తదితర కారణాల దృష్ట్యా నీటిని ఎక్కువగా వినియోగించే జొన్న, మొక్కజొన్న సాగు చేయవద్దని సూచించారు. అయితే అన్యూహంగా మిచౌంగ్‌ తుపాను వచ్చి ఖరీఫ్‌ పంటలను నష్టం చేకూర్చినా అధిక వర్షాల వల్ల రెండో పంటగా జొన్న, మొక్కజొన్న సాగుకు నీటి కొరత తీరింది. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అధిక వర్షాల వల్ల దాదాపు వారం పాటు పొలాల్లో నీరు నిలిచిపోవడం, ఖరీఫ్‌ పంటలు దెబ్బతినడం, వాటిని తొలగించిన తరువాత భూమిలో తేమ కొనసాగుతుండటం, ఎండలు తక్కువగా ఉండటం, చలి తీవ్రత పెరిగి రాత్రి వేళ మంచుకురవడం వల్ల ప్రస్తుతానికి నీటి ఎద్దడి లేనందున జొన్న, మొక్కజొన్న సాగు చేయాలనే ఆలోచనలో రైతులున్నారు. ప్రధానంగా గుంటూరు జిల్లాలో వరి సాగు చేసిన 1.50 లక్షల ఎకరాలు, పల్నాడు జిల్లాలో వరి సాగు చేసిన మరో 40 వేల ఎకరాల్లో రెండో పంటగా ఈ పంటలను సాగు చేయాలని రైతులు యోచిస్తున్నారు. గుంటూరు జిల్లాలో 51 వేల ఎకరాలు జొన్న సాగు చేస్తారని అంచనా కాగా గతనెలాఖరు వరకు 1100 ఎకరాల్లోనే సాగు చేశారు. ఈనెల మొదటివారంలో తుపాను రావడం, తరువాత పొలాల్లో నీటి నిల్వలు తొలగకపోవడం, దెబ్బతిన్న పంటలను ఇంకా పూర్తిగా తొలగించకపోవడం వల్ల జొన్న సాగు ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. మొక్కజొన్న సాగు కూడా 50 వేల ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా కాగా ఇప్పటి వరకు కేవలం వెయ్యి ఎకరాల్లోనే వేశారు. ఈ నెల 15 నుంచి ఈ రెండు పంటలు వేయడానికి రైతులు సంసిద్దులవుతున్నారు. 20 వేల ఎకరాల్లో శనగ సాగు చేస్తారని అంచనా ఉండగా తుపాను రావడానికి ముందు వరకు 17 వేల ఎకరాల్లో శనగ వేశారు. అయితే దాదాపు 10 వేల ఎకరాల్లో శనగ పైరు తుపానుకు నీట మునిగి దెబ్బతింది. 15 వేల ఎకరాల్లో మినుము సాగవుతుందని అంచనా వేయగా కేవలం 3 వేల ఎకరాల్లో సాగైంది. దాదాపు రెండు వేల ఎకరాల్లో మినుము తుపానుకు దెబ్బతింది. పల్నాడు జిల్లాలో 20 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయాల్సి ఉండగా 3 వేల ఎకరాలలో సాగు చేశారు. 25 వేల ఎకరాల్లో శనగ సాగుచేస్తారని అంచనా కాగా 15 వేల ఎకరాల్లో సాగు చేశారు. తుపాను వల్ల 10 వేల ఎకరాల్లో తుపాను దెబ్బతింది. 5 వేల ఎకరాల్లో మినుము సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం వెయ్యి ఎకరాల్లోనే సాగు చేశారు. ప్రస్తుతం రబీ పంటలుగా సాగు చేసిన శనగ, మినుము, పెసర తదితర పంటలు తుపానుకు దెబ్బతినడం వల్ల ప్రత్యామ్నాయంగా ఇప్పటికిప్పుడు జొన్న, మొక్కజొన్న తప్ప ఇతర పంటలు వేసేందుకు కూడా అవకాశం లేదంటున్నారు. పల్నాడు జిల్లాలో 1.24 లక్షల ఎకరాల్లో. గుంటూరు జిల్లాలో 30 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేయగా అధిక వర్షాల వల్ల రెండు జిల్లాల పరిధిలో దాదాపు 40 వేల ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతింది. మిర్చి పీకేసి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు.

➡️