ప్రజాశక్తి-యర్రగొండపాలెం భవిష్యత్ గ్యారెంటీ టిడిపితోనే సాధ్యమని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండలంలోని బిళ్లగొంది పెంట, పోతురాజుపెంట, గౌతమబుద్దుని కాలనీలో గురువారం బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ ఐటిడిఏ ద్వారా సింగల్ ఫేస్ కరెంటు అదే విధంగా చూడాలన్నారు. మంచినీటి సమస్య పరిష్కరించాలన్నారు. వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇవన్నీ సమకూర్చేవారని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసిన రోడ్డుకు పెరిగిన కంప కూడా తొలగించలేకపోయిందని విమర్శించారు. ఉపాధి హామీ పనులు కల్పించడం లేదన్నారు. దీంతో వలసలు వెళ్లాల్సివస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ మహిళలకు టీడీపీ ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోలోని అంశాలపై అవగాహన కల్పించారు. తల్లికి వందనం ద్వారా ఇంట్లో చదువుతున్న ప్రతి ఒక్కరికీ ఏటా రూ.15 వేలు, ఆడబిడ్డ నిధి ద్వారా ప్రతినెలా రూ.1500, అన్నదాతలకు ఏటా రూ.20 వేలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ యువతకు యువగళం ద్వారా ఉద్యోగాల కల్పన, దీపం పథకం ద్వారా ఏటా మూడు సిలిండర్లను ఉచితంగా అందజేస్తారన్నారు. గ్రామ ప్రజలకు ష్యూరిటీ బాండ్లను అందజేశారు. గ్రామాల్లోని బూత్ ఇన్‌ఛార్జులు ఇంటింటికీ వెళ్లి టీడీపీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి ప్రతి కుటుంబం సమాచారాన్ని టెలిగ్రామ్ బాట్లో అప్డేట్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చేకూరి సుబ్బారావు, నాయకులు చిట్టేల వెంగళరెడ్డి, తోటా మహేష్ నాయుడు, చెవుల అంజయ్య, చేదూరి కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
