టిడిపిలో తొలగని ఉత్కంఠ

టిడిపిలో టికెట్ల ఉత్కంఠ తొలగలేదు. టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రెండు విడతల్లో కడప, అన్నమయ్య జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాల్లో తొమ్మిది స్థానాలకు టికెట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం మూడో విడత కింద ప్రకటించిన 11 అసెంబ్లీ టికెట్లలో జిల్లాల్లోని పెండింగ్‌ స్థానాల ప్రకటన లేకపోవడం ఉత్కంఠగా మారింది. కడప, అన్నమయ్య జిల్లాల పరిధిలోని జమ్మలమడుగు, బద్వేల్‌, రాజంపేట, రైల్వేకోడూరు అసెంబ్లీ టికెట్ల కేటాయింపు వ్యవహారం కొలిక్కి రాలేదు. ఆశావహుల్లో ఆశలు సన్నగిల్లినట్లు తెలుస్తోంది.ప్రజాశక్తి – కడప ప్రతినిధిటిడిపిలో అనిశ్చితి రాజ్యమేలుతోంది. పొత్తు పేరుతో టికెట్లు కేటా యింపు పట్ల చూపుతున్న నాన్పుడు ధోరణి కనిపిస్తోంది. కడప జిల్లాలో కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేల్‌, అన్నమయ్య జిల్లాలో రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.13 అసెంబ్లీ స్థానాలకుగానూ రెండు విడతల్లో తొమ్మిది స్థానాలకు టికెట్లు ప్రకటించారు. మిగిలిన జమ్మల మడుగు, బద్వేల్‌, రాజంపేట, రైల్వేకోడూరు స్థానాలకు పొత్తు పేరుతో బిజెపి, జనసేన అభ్యర్థుల పేర్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మూడవ విడతలో ప్రకటించే అవకాశం ఉందని ఆశించిన ఆశావహులకు నిరాశ తప్పలేదు.రాజంపేట వయా విజయనగరం! కడప, అన్నమయ్య జిల్లాలోని ఆ నాలుగు పెండింగ్‌ స్థానాల్ని బిజెపి, జనసేన అభ్యర్థులకు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. రాజంపేట అసెంబ్లీ టికెట్‌ను బిజెపికి కేటాయించి, విజయనగరం టికెట్‌ను టిడిపి అంటిపెట్టుకునేందుకు అవసరమైన చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. రాజంపేట పార్లమెంట్‌ టికెట్‌ను సైతం బిజెపికి వదిలే అవకాశాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. పదేళ్లుగా పార్టీని బలోపేతం చేసుకున్న అసెంబ్లీ ఇన్‌ఛార్జులను పొత్తు పేరుతో నిరాకరిస్తుండటం కేడర్‌లో నిరుత్సాహం నెలకొంది. రాజంపేటలో వైసిపి, టిడిపి మధ్య హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయనే అంచనాల నేపథ్యంలో బిజెపికి కేటాయించడమేమిటనే వాదన వినిపిస్తోంది. అన్నమయ్య జిల్లాలో మిగిలిన రైల్వేకోడూరు రిజర్వ్డు స్థానాన్ని జనసేనకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.’ఆది’లోనే హంసపాదు జమ్మలమడుగు వ్యవహారం ‘ఆది’లోనే హంసపాదు సామెతను తలపించింది. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణరెడ్డి పోటీ చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. బిజెపి అధిష్టానం లాబీయింగ్‌ ద్వారా టికెట్‌ సాధించుకునేందుకు ప్రయత్నం చేశారు. ఆయన పోటీ చేయడం పట్ల కుటుంబంలో చీలిక రావడంతో వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. రెండు నెలల కిందటి నుంచే జమ్మలమడుగు టిడిపి ఇన్‌ఛార్జి భూపేష్‌రెడ్డి తనదైన శైలిలో పాదయాత్ర నిర్వహిస్తూ ప్రజా సమస్యల ప్రస్తావన ద్వారా ప్రజలను ఆకట్టుకునే పనిలో నిమగం కావడం తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో బిజెపి పొత్తులో భాగంగా కడప పార్లమెంట్‌ టికెట్‌ను అడుగుతున్నట్లు ప్రచారం నడుస్తోంది.బద్వేల్‌ బరిలో ఎవరు..?బద్వేల్‌ రిజర్వు స్థానంలో పోటీకి బిజెపి కసరత్తు చేస్తోంది. బద్వేల్‌ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన పనతల సురేష్‌ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నిక బరి నుంచి ప్రధాన ప్రతిపక్ష టిడిపి, జనసేన తప్పుకున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష టిడిపి పరోక్ష మద్దతుతో బిజెపి అభ్యర్థికి 24 వేల ఓట్లు లభించిన సంగతి తెలిసిందే. ఇటువంటి పూర్వరంగంలో ప్రతిపక్ష టిడిపి, జనసేన సంయుక్త మద్దతుతో మరోసారి అధికార వైసిపి, కాంగ్రెస్‌ అభ్యర్థులతో తలపడేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. కేంద్రంలోని బిజెపి సర్కారు సిఎఎ గైడ్‌లైన్స్‌ ఫ్రేమ్‌ చేసిన నేపథ్య ంలో 2,17,769 ఓటర్లలో 30 వేలు ముస్లిమ్‌, సుమారు 70 వేల దళితుల ఓట్లు తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఏదేమైనా పొత్తు ధర్మం పేరుతో బద్వేల్‌ టిడిపి అభ్యర్థిగా బరిలో నిలవనున్నట్లు ప్రచారమైన రోశన్నకు, రాజంపేటలో జగన్మోహన్‌రాజు, బత్యాల చెంగల్రాయులకు టికెట్‌ నిరాకరణ అనేది తేటతెల్లమవుతోంది.

➡️