ప్రజాశక్తి-బాపట్ల: ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకుని సురక్షిత ప్రయాణం ద్వారా క్షేమంగా గమ్యం చేరాలని బాపట్ల మోటారు వాహన తనిఖీ అధికారి డిబివి రంగారావు అన్నారు. మంగళవారం 35వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా మంగళవారం బాపట్ల పురపాలక సంఘం కౌన్సిల్ హాల్లో వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మోటారు వాహన తనిఖీ అధికారి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమంలో రంగారావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రయాణాలు కొనసాగించాలని అన్నారు. పరిమిత వేగంతో ప్రయాణించి సురక్షితంగా గమ్యం చేరాలని అన్నారు. అతివేగంగా ప్రయాణించి ప్రాణాలు పోగొట్టుకొనే దుస్థితి తెచ్చుకోవద్దని అన్నారు. కోట్లు వెచ్చించినా పోయిన ప్రాణం తిరిగి రాదన్నారు. రహదారిపై ప్రయాణించే సమయంలో క్షణం క్షణం అత్యంత జాగ్రత్తతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రధానంగా వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించడం వారి విధుల్లో ఒక భాగంగా చేపట్టాలన్నారు. ప్రధానంగా మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదం బారిన పడితే వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి వారికి కఠిన శిక్షలు అమలు చేస్తామని హెచ్చరించారు. ఆటోల్లో సైతం పరిమితికి మించి ప్రజలు ప్రయాణించి ప్రమాదాలకు గురికావద్దని కోరారు. ప్రధానంగా యువకులు పరిమిత వేగంతో ప్రయాణించాలని సూచించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19 వరకు రహదారి భద్రత మాసోత్సవాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ మోటారు తనిఖీ అధికారి బి కిషోర్‌బాబు, రహదారి భద్రత వైద్యులు నరేంద్ర, వార్డు వాలంటీర్లు, సచివాలయ, మోటార్ వాహన తనిఖీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
