డంపింగ్‌ యార్డు తరలింపులో నిర్లక్ష్యం!

డంపింగ్‌ యార్డు తరలింపులో నిర్లక్ష్యం!

ప్రజారోగ్యం పట్టని ప్రభుత్వం, జివిఎంసి యంత్రాంగం

సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు

ప్రజాశక్తి-గాజువాక : జివిఎంసి గాజువాక జోన్‌ 76వ వార్డు రామచంద్రనగర్‌ ప్రాంతంలో ఉన్న మున్సిపల్‌ చెత్త డంపింగ్‌ యార్డ్‌ను తక్షణమే తరలించాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు డిమాండ్‌ చేశారు. బుధవారం డంపింగ్‌ యార్డ్‌ పరిసర ప్రాంతీయులతో కలిసి డంపింగ్‌ యార్డ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని పరిరక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, జివిఎంసి, చెలగాటమాడుతోందని దుయ్యబట్టారు. 76వ వార్డు రామచంద్రనగర్‌, స్వతంత్ర నగర్‌, డెయిరీ కాలనీ, బర్మా కాలనీ, రిక్షాకాలనీ, గాంధీనగర్‌ తదితర 16 గ్రామాల ప్రజలతో పాటు సర్ధార్‌ నెస్ట్‌, నోవస్‌ తదితర అపార్ట్‌మెంట్ల వాసులు ఈ డంపింగ్‌యార్డు వల్ల తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గర్భిణులు, పిల్లలు, వృద్ధులు రకరకాల వ్యాధులకు గురై వైద్యానికి వేలల్లో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. చెత్తకు సైతం పన్ను వేసి ముక్కుపిండి వసూలు చేస్తున్న ప్రభుత్వం, జివిఎంసి ప్రజారోగ్యశాఖ దుర్గంధం, చెత్తాచెదారంతో అవస్థలు పడుతున్న ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్‌ యార్డును జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయడమే కాకుండా, ఉన్నవాటిని తరలించాలని డిమాండ్‌ చేశారు. 76వ వార్డు ప్రజల ఆరోగ్యంపై దాడిచేస్తున్న ప్రభుత్వం, జివిఎంసి యంత్రాంగం ఇప్పటికైనా కళ్లు తెరవాలని, లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.సిపిఎం గాజువాక జోన్‌ కార్యదర్శి ఎం రాంబాబు మాట్లాడుతూ 2013 నుంచి నేటివరకు డంపింగ్‌ యార్డు తరలించాలని ఈప్రాంతీయులు పలు రూపాల్లో ఆందోళన చేస్తున్నా ప్రభుత్వాలు, అధికారులు స్పందించడం లేదన్నారు. ప్రజాందోళనలకు నాడు,నేడు, రేపు కూడా సిపిఎం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. గతంలో తెలుగుదేశం తరపున పల్లా శ్రీనివాసరావు, ప్రస్తుతం వైసిపి ఎమ్మెల్యేగా తిప్పల నాగిరెడ్డి పదవులు నిర్వహించినా డంపింగ్‌ యార్డు సమస్య పరిష్కారానికి కనీసం చొరవ చూపలేదన్నారు. ప్రజలకు హామీలివ్వడం, గెలిచాక సమస్యను పక్కన పెట్టడం వీరికి పరిపాటిగా మారిందన్నారు. జివిఎంసి యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే ప్రజాఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం గాజువాక జోన్‌ నాయకులు డి.రమణ, రాజు, రాముడు స్థానిక సంఘాల నాయకులు రాజారావు, త్రినాధరావు, చిన్నారావు, జనార్ధనరావు పాల్గొన్నారు.

డంపింగ్‌ యార్డ్‌ను పరిశీలిస్తున్న జగ్గునాయుడు రాంబాబు

➡️