తప్పుడు విమర్శలు చేస్తే కేసులు

 పాచిపెంట : తనపై తప్పుడు విమర్శలు చేసిన టిడిపి నాయకులపై పరువు నష్టం దావా, అట్రాసిటీ కేసులు తప్పవని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర హెచ్చరించారు. గురువారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిపి బి.ప్రమీల అధ్యక్షతన పట్టాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాజన్నదొర చేతులు మీదుగా 120 మంది లబ్ధిదారులకు 170 ఎకరాల 67 సెంట్లు డి పట్టా డీకే పట్టాలు, అలాగే కొటికిపెంట నిర్వాసితులకు 283 ఇళ్లపట్టాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టిడిపి నాయకులు వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు చేస్తే సహించబోనని హెచ్చరించారు. ఒకప్పుడు ఏది కావాలన్నా అధికారుల చుట్టూ ప్రజలు తిరిగేవారని, ఇప్పుడు తమ ప్రభుత్వం అటువంటి పరిస్థితి లేదన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.25 లక్షలు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. జనవరి నుంచి రూ.3వేలు పింఛను అందిస్తామన్నారు. మండలంలో రూ.100 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. కావున మళ్లీ వైసిపిని గెలుపించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ ఎం.రాజశేఖర్‌, ఎంపిడిఒ పి.లక్ష్మీకాంత్‌, వైసిపి నాయకులు డోల బాబ్జీ, పి.వీరంనాయుడు, ఇజ్జాడ అప్పలనాయుడు, దండి ఏడుకొండలు, కె.ధనుంజయ, సలాది అప్పలనాయుడు, గండిపల్లి రాము, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు

➡️