తాడోపేడో తేల్చుకుంటాం..!

Dec 19,2023 21:20
తిరుపతిలో రోడ్డుపైనే వంటావార్పు చేస్తున్న అంగన్‌వాడీలు

తాడోపేడో తేల్చుకుంటాం..!ప్రజాశక్తి – యంత్రాంగం ‘ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం.. ఏళ్ల తరబడి నిరీక్షించాం.. పెంచిన నిత్యావసర ధరలతో బతకలేం.. మేమేమీ కొత్తగా ఏవీ అడగడం లేదు.. సిఎం జగన్‌ ఇచ్చిన హామీనే నెరవేర్చమంటున్నాం..’ అంటూ ఎనిమిదో రోజూ అంగన్‌వాడీల సమ్మె అదే ఉద్వేగంతో కొనసాగింది.. ప్రతి శిబిరం వద్ద వారే స్వచ్ఛందంగా డబ్బులు వేసుకుని వంటావార్పు చేసి అందరూ కలసి భోంచేశారు. సమ్మె శిబిరాలన్నీ కిటకిటలాడాయి.. ఐక్యంగా సమ్మె కొనసాగించి, వేతనం పెంచుకునే ఇళ్లకు వెళతాం అని అంగన్‌వాడీలు స్పష్టం చేస్తున్నారు. అప్పులు చేసి బతకలేం : వాణీశ్రీ పిచ్చాటూరు : ప్రభుత్వం తమ డిమాండ్లన్నీ పరిష్కరించేంత వరకూ సమ్మె కొనసాగుతుందని యూనియన్‌ జిల్లా కార్యదర్శి వాణీశ్రీ స్పష్టం చేశారు. చాలీచాలని వేతనాలతో ఎన్నాళ్లని బతుకు జీవనం సాగిస్తామని ప్రశ్నించారు. ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తే, వచ్చే ఎన్నికల్లో అంగన్‌వాడీల సత్తా చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. సిఐటియు జిల్లా నాయకులు ప్రసాద్‌, నాయకులు నాగరాజు, రామచంద్రారెడ్డి, అంగన్‌వాడీలు శ్రీవాణి, పూర్ణమ్మ,కల్యాణి, కృష్ణవేణి, శ్రీదేవి, భారతి, దేవి నాయకత్వం వహించారు. – సత్యవేడు ఐసిడిఎస్‌ ప్రాజెక్టు ఎదుట సిఐటియు డివిజన్‌ కార్యదర్శి రమేష్‌ నాయకత్వంలో ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీలు పాల్గొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను సచివాలయ సిబ్బందితో తెరవాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. నాయకులు నిర్మల, శాంతి, ఇందిర, ఝాన్సీ, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. – నాయుడుపేటలో ప్రాజెక్టు కార్యదర్శి శ్యామలమ్మ నేతృత్వంలో వంటావార్పు చేపట్టారు. సిఐటియు నాయకులు శివకవి ముకుందా, మునిరాజ, మహేష్‌, విజయమ్మ, సుకుమారి పాల్గొన్నారు. – గూడూరు టౌన్‌లో వినూత్నంగా వంటావార్పు చేపట్టారు. తల్లులు వారి చంటి పిల్లలను ఎత్తుకుని సమ్మె శిబిరం వద్దకుచేరుకుని వంటావార్పుకు శ్రీకారం చుట్టారు. జెవికెస్‌ నాయకులు సంక్రాంతి వెంకటయ్య, సత్యసాయి జిల్లా నుంచి ఎస్‌.నాగరాజులు 30 మంది కళాకారులు శిబిరం వద్దకు చేరుకుని మద్దతు ప్రకటించారు. రైతుసంఘం నాయకులు జోగి శివకుమార్‌, అంగన్‌వాడీ అధ్యక్షురాలు ఎ.ఇంద్రావతి, సిఐటియు నాయకులు బివి రమణయ్య పాల్గొన్నారు – పుత్తూరు తహశీల్దార్‌ ఆఫీసు ఎదుట వంటావార్పు చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి చర్చలకు పిలిపించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. తిరుపతి ఆర్‌డిఒ నిశాంత్‌కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. యూనియన్‌ నాయకులు మునికుమారి, విజయకుమారి, ధనమ్మ, రాధ, గంగులమ్మ పాల్గొన్నారు. – వెంకటగిరిలో టిడిపి నాయకులు డాక్టర్‌ మస్తాన్‌ యాదవ్‌ మద్దతు ప్రకటించారు. తమ ప్రభుత్వం రాగానే కనీస వేతన చట్టంపై సంతకం చేస్తారన్నారు. సిఐటియు నాయకులు వడ్డేపల్లి చెంగయ్య, ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యదర్శి స్వరూపరాణి, మంజుల, ఐఎఫ్‌టియు నాయకులు ప్రసన్న, వరమ్మ పాల్గొన్నారు. – శ్రీకాళహస్తిలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య, ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి రాయపనేని హరిక్రిష్ణ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు వంటావార్పు చేశారు.- సూళ్లూరుపేటలో నాయకులు కె.లక్ష్మయ్య, సిహెచ్‌ సుధాకర్‌ సంఘీభావం తెలిపారు.అంగన్‌వాడీ నాయకులు హైమావతి సంఘీభావం తెలుపుతున్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు.తాళాలు పగలగొట్టమన్న ఉత్తుర్వులు లేవు : ఎంపిడిఒ వెంకటగిరి : అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టమని రాతపూర్వకంగా ఉత్తర్వులు రాలేదని వెంకటగిరి ఇన్‌ఛార్జి ఎంపిడిఒ విజయలక్ష్మి అన్నారు. అంగన్‌వాడీ వర్కర్లు సమ్మెలో ఉన్నందున సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలను ఓపెన్‌ చేసి పిల్లలకు పౌష్టికాహారం అందించాలని కలెక్టర్‌ వీడియోకాన్ఫరెన్స్‌లో ఆదేశించారన్నారు. కొన్ని సెంటర్లను తెరచి పిల్లలకు ఆహారం అందిస్తున్నామన్నారు. తాళాలు పగలగొట్టిన సచివాలయ సిబ్బందిదొరవారిసత్రం : గత వారం రోజులుగా అంగన్వాడి కేంద్ర కార్యకర్తలు, సహాయకులు నిరవధిక సమ్మెలో ఉండడంతో కేంద్రాలన్నిటికీ తాళాలు వేశారు. దీంతో ప్రీ స్కూల్‌ పిల్లలకు, దినసరి అందించే వైయస్సార్‌ సంపూర్ణ పోషణ సరఫరా ఆగిపోయింది. ప్రభుత్వానికి, యూనియన్‌ నాయకుల మధ్య వారి డిమాండ్లలో సయోధ్య కుదరకపోవడంతో సమ్మె కొనసాగుతూనే ఉంది. అధికారుల ప్రత్యామ్నాయ మార్గాలుగా అంగన్వాడీ కేంద్రాలు తెరవడానికి రంగంసిద్ధం చేశారు. దొరవారిసత్రం మండల పరిధిలోని ఎంపీడీవో రఘురామయ్య ఆదేశాల మేరకు ఒక్కొక్కటిగా తాళాలు తొలగిస్తున్నారు. చవట కండ్రిగ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని మాజీ సర్పంచ్‌ సుబ్రహ్మణ్యం, కార్యదర్శి సమక్షంలో తాళాలను తొలగించారు. కేంద్రానికి పిల్లలను పిలిపించి వారికి భోజనం సదుపాయానికి చర్యలు చేపట్టారు. అంగన్వాడీ వర్కర్లు మాత్రం తాడోపేడో తేల్చుకునే వరకు నిరవధిక సమ్మెను ఆపేది లేదనే ధోరణిలో సమ్మెను కొనసాగిస్తూనే ఉన్నారు. తిరుపతిలో రోడ్డుపైనే వంటావార్పు చేస్తున్న అంగన్‌వాడీలు

➡️