నూరు శాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యంగా మిషన్‌ ఇంద్ర ధనుష్‌

ప్రజాశక్తి – వీరఘట్టం : ప్రమాదకర వ్యాధుల నుండి పిల్లలకు రక్షణ కల్పించేందుకు శత శాతం వ్యాక్షినేషన్‌ లక్ష్యంగా మిషన్‌ ఇంద్ర ధనుష్‌ టీకా కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభమైందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి.జగన్నాధరావు అన్నారు. ఈ మేరకు ఆయన వీరఘట్టం – 2 సచివాలయంలో వైద్య సిబ్బంది నిర్వహించిన మిషన్‌ ఇంద్ర ధనుష్‌ టీకా కార్యక్రమాన్ని సోమవారం తనిఖీ చేశారు. నిర్దేశించిన మార్గదర్శకాలను టీకా కేంద్రంలో ఏ మేరకు అమలు చేస్తున్నారో పరిశీలించారు. పిల్లలకు టీకా వేస్తున్న తీరు, టీకా అర్హుల వివరాలు, పిల్లల వయస్సు రికార్డులో పరిశీలించారు. శనివారం వరకు కార్యక్రమం కొనసాగించాలని, పలు కారణాల వల్ల గతంలో టీకాలు వేసుకోకుండా మిగిలిన పిల్లలందరికీ టీకా పూర్తి చేయాలని, వివరాలన్నీ యూవిన్‌ పోర్టల్‌లో ఆన్లైన్‌ చేయాలని వైద్యాధికారిని, సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ జగన్నాథరావు మాట్లాడుతూ పిల్లల్లో ప్రమాదకర వ్యాధుల బారి నుంచి కాపాడేందుకు పూర్తి స్థాయిలో టీకాలు తప్పనిసరి అని, వ్యాక్సిన్‌ వేసుకోకుండా మిగిలిపోయిన పిల్లలను గుర్తించి, అవసరమైన వ్యాక్సిన్లు వేసేందుకు ప్రభుత్వం మిషన్‌ ఇంద్ర ధనుష్‌ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు. ప్రస్తుతం మూడో రౌండ్‌ జరుగుతుందన్నారు. వీరితో పాటుగా షెడ్యూలు ప్రకారం అర్హులైన పిల్లలు, గర్భిణీలకు ఈ కార్యక్రమం ద్వారా టీకా వేయనున్నట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏడాది లోపు పిల్లలు 849, 1 నుంచి ఐదేళ్ల లోపు పిల్లలు 423 మంది, గర్భిణీలు 282 మందికి మిషన్‌ ఇంద్ర ధనుష్‌లో టీకాలు వేస్తున్నామన్నారు. మొదటి, రెండవ రౌండ్‌ మిషన్‌ ఇంద్ర ధనుష్‌ టీకా కార్యక్రమాలు ఆగస్టు, సెప్టెంబర్‌లో పూర్తి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ ఉమామహేశ్వరి, డెమో యోగీశ్వరరెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.టీకా కార్యక్రమం తనిఖీగరుగుబిల్లి: మండలంలోని సంతోషపురం, తోటపల్లి, నాగూరు గ్రామాల్లో మిషన్‌ ఇంద్ర ధనుష్‌ టీకా కార్యక్రమాన్ని జిల్లా హెల్త్‌ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ టి.జగన్మోహనరావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీకా కేంద్రంలో వ్యాక్సిన్‌, అత్యవసర మందుల కిట్‌, హబ్‌ కట్టర్‌ పనితీరు, అర్హుల జాబితా వివరాలు, కార్యక్రమాన్ని సూచించే పోస్టర్లు పరిశీలించారు. ఏఏ టీకాలు వేశారు. ఆ పిల్లల వయస్సు రికార్డులో తనిఖీ చేశారు. అలాగే యూవిన్‌ పోర్టల్‌లో ఆన్లైన్‌ వివరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ జగన్మోహనరావు మాట్లాడుతూ ఈ నెల 11 నుంచి 16 వరకు మిషన్‌ ఇంద్ర ధనుష్‌ మూడవ రౌండ్‌ టీకా కార్యక్రమాన్ని కొనసాగించాలని, గతంలో ఏవైనా కారణాల వల్ల టీకా తప్పిన పిల్లలకు ఈ కార్యక్రమంలో పూర్తి చేయాలన్నారు. అలాగే తాత్కాలిక జీవనం, వలస జీవనం గడిపే వారిని ఆయా పరిధిలో గుర్తిస్తే అక్కడ పిల్లల్లో అర్హులుంటే టీకా వేయాలన్నారు. వివరాలన్నీ అదే రోజు యూవిన్‌ పోర్టల్‌లో ఆన్లైన్‌ చేయాలన్నారు. టీకా నిర్వహణ గురించి ముందు రోజునే అక్కడ ప్రజలకు తెలియజేయాలన్నారు. అనంతరం ఆయన అక్కడ వెల్నెస్‌ కేంద్రాల్లో మందులు, వైద్య పరికరాలు పరిశీలించారు. మాతా శిశు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ కనబర్చాలన్నారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు ఎం.సన్యాసమ్మ, జయగౌడ్‌, ఎఎన్‌ఎంలు యశోద కుమారి, కళావతి, సోములమ్మ, ఎంఎల్‌ హెచ్‌ పి.శ్రావణి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు..

➡️