నెరవేరుతున్న పేదల సొంతింటి కల: అన్నా

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌: ప్రతి పేదవాని సొంతింటి కలలను నిజం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టడం శుభపరిణామమని గిద్దలూరు ఎమ్మెల్యే, వైసీపీ మార్కాపురం నియోజకవర్గం సమన్వయకర్త అన్నా రాంబాబు అన్నారు. గురువారం స్థానిక ఎస్సీ బీసీ కాలనీలోని డ్వాక్రా బజార్లో మార్కాపురం పురపాలక సంఘ పరిధిలో అర్హులైన 4007 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్‌ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఇచ్చినమాట ప్రకారం ప్రతి సంక్షేమ పథకం అమలు చేసిన ఘనత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి అధికార పీఠంపై మరలా జగన్మోహన్‌రెడ్డిని కూర్చోబెట్టడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ బాలమురళీకృష్ణ, మార్కాపురం వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ డాక్టర్‌ మీర్జా షంషీర్‌ అలీ బేగ్‌, వైస్‌ చైర్మన్లు షేక్‌ ఇస్మాయిల్‌, సిహెచ్‌ అంజమ్మ, పురపాలక సంఘం కమిషనర్‌ కిరణ్‌, పలు వార్డులకు చెందిన కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు, వార్డు ఇన్‌ఛార్జులు, వైసిపి ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️