ప్రజాశక్తి – కడప రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.విజరు రామరాజు అన్నారు. రానున్న సాధారణ ఎన్నికలు -2024 పురస్కరించుకుని మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో జెసి గణేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సూర్య ప్రవీణ్ చంద్, ఎఎస్‌పి తుషార్ డుడి, అసిస్టెంట్ కలెక్టర్ భరద్వాజ్, డిఆర్‌ఒ గంగాధర్ గౌడ్‌తో కలిసి రిటర్నింగ్ అధికారులు, ఇఆర్‌ఒలు, నోడల్ అధికారులు, సెక్టోరల్ అధికారులు, సెక్టార్ పోలీస్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల పరిశీలన మొదలుకొని పోలింగ్ ప్రక్రియ ముగిసి ఇవిఎంలను స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచే వరకు సెక్టోరల్ అధికారులు కీలక బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. నిర్లక్ష్యానికి తావులేకుండా నిర్దేశించిన విదులను సమర్థవంతంగా నిర్వర్తించి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన అన్నారు. ఒక్కొక్క సెక్టోరల్ అధికారి తమకు అప్పగించిన పోలింగ్ కేంద్రాల పరిధిలో విధులను తు. చ తప్ప కుండా నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. సెక్టోరల్ అధికారులు చేయవలసిన విధులు నార్మల్, క్రిటికల్, వల్నరబిలిటి, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి వెంటనే తమకు రిపోర్టు పంపాలని చెప్పారు. తమకు అప్పగించిన అన్ని పోలింగ్ కేంద్రాలను ముందుగానే సందర్శించి ఎన్నికల ప్రక్రియకు కావాల్సిన పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపు, ఫర్నిచర్, వీల్ చైర్స్, విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, అప్రోచ్ రోడ్లు, వెబ్ క్యాస్టింగ్ చేయుటకు అవసరమైన విద్యుత్, ఇంటర్నెట్,సెల్ నెట్వర్క్ సిగల్ సౌకర్యాలు ఉన్నాయా లేవా అని పరిశీలించి రిపోర్టును తమకు అందజేయాలని సూచిం చారు. 80 సంవత్సరాల పైబడిన వారికి ఇంటి వద్దనే ఓటు వేయడానికి అవస రమైన చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ సిబ్బందిని వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. డిస్ట్రిభూషన్ సెంటర్ నుంచి పోలింగ్ స్టేషన్‌కు ఎంత సమయం పడుతుంది, రోడ్లు ఎలా ఉన్నాయి, బస్సులు ఎన్నికావాలి, బిఎల్‌ఒల సమాచారంపై అవగాహన కల్గివుండాలి. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవరోధాలు ఎదురైనా వాటిని తక్షణమే పరిష్కరించాలి. కార్యక్రమంలో కడప, జమ్మలమడుగు, బద్వేల్, పులివెందుల ఆర్డీవోలు మధుసూదన్, శ్రీనివాసులు, వెంకట రమణ, వెంకటేశం, సిపిఒ వెంకటరావు, నోడల్ అధికారులు, డిఎస్‌పిలు, సెక్టార్ పోలీసు అధికారులు, తహశీల్దార్లు, సెక్టరోల్ అధికారులు పాల్గొన్నారు.
