ప్రజాశక్తి-రోలుగుంట: మండలంలోని కుసర్లపూడి గ్రామంలో గ్రామదేవత పెద్దింటమ్మ పండుగకు పింఛను సొమ్ము కోతపెట్టి, వాలంటీరు విరాళాలు వసూలు చేయడంపై మంగళవారం ఇఒపిఆర్‌డి నూకరాజు, గ్రామ కార్యదర్శులు డి.సుబ్బారావు, సంతోష్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ ఈశ్వరరావు విచారణ చేపట్టారు. గ్రామంలో ఇటీవల కొత్తగా మంజూరైన 13 పింఛన్లతో కలిపి 435మంది పింఛనుదారులుండగా, కొత్త పింఛనుదారుల నుంచి మొత్తం సొమ్మును, మిగిలిన వారి నుంచి రూ.1500 చొప్పున వసూలు చేశారని కొందరు పింఛనుదారులు, మాజీ సర్పంచ్ గండి తాతాజీ సోమవారం మండల తహశీల్దార్, ఎంపిడిఒకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇఒపిఆర్‌డి నూకరాజు విచారణ చేస్తుండగా, సర్పంచ్ మడ్డు అప్పలనాయుడు వర్గీయులు మాజీ సర్పంచ్ గండి తాతాజీ వర్గీయుల మధ్య వివాదం, తోపులాట జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను సముదాయించారు. దీనిపై పింఛనుదారులు, ఫిర్యాదీలను విచారించిన ఇఒపిఆర్‌డి, నివేదికను ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళతానన్నారు.
విచారణ చేస్తున్న అధికారులు