పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం : కలెక్టర్‌

ప్రజాశక్తి-బి.కొత్తకోట 0-5 సంవత్సరాలలోపు వయస్సు గల చిన్నారులందరికీ రెండు పోలియో చుక్కలు వేయించి వారి పోలియో రహిత సమాజానికి కషి చేద్దామని జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ పిలుపునిచ్చారు.ఆదివారం హర్సిలీహిల్స్‌లోని ఎమర్జెన్సీ మెడికల్‌ కేంద్రంలో పిల్లలకు పోలియో చుక్కలు వేసి పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజులపాటు మార్చి 5వ తేదీ వరకు చేపట్టే పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.జిల్లా వ్యాప్తంగా సుమారు 1,93,946 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ కషి చేస్తుందన్నారు.ప్రజల భాగ స్వామ్యంతోనే పోలియో నిర్మూలన వంద శాతం సాధ్యం అవుతుం దన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యల ద్వారా దేశ వ్యాప్తంగానే కాకుండా జిల్లాలో కూడా పోలియోను పూర్తి స్థాయిలో నిర్మూలించగలిగామన్నారు. పోలియో వైరస్‌ మన చుట్టూ లేకపోయినప్పటికీ పక్క దేశాలయిన పాకిస్థాన్‌, ఆప్గనిస్థాన్‌ దేశాల్లో కొంతవరకు పోలియో ప్రభావం ఉండటం వల్ల ముందస్తుగా ప్రతి ఒక్కబిడ్డను పోలియో నుండి రక్షించుకోవడం మన బాధ్యత అన్నారు. పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలన్నారు.నిండు జీవితానికి రెండు చుక్కలు అన్న నినాదాన్ని సమాజంలో విస్తత పరచడంలో జిల్లా ప్రజారోగ్య శాఖ,స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిబ్బంది ప్రత్యేక దష్టి సారించాలన్నారు. ప్రధానంగా నేడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బూత్‌ లతోపాటు మున్సిపాలిటీల్లోని వార్డుల్లో, గ్రామాల్లో, బస్టాండులు,రైల్వే స్టేషన్లు, వలస కూలీలు ఉన్న చోట, జనం అధికంగా ఉన్నచోట పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో మదనపల్లి ఆర్‌డిఒ హరిప్రసాద్‌, వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు

➡️