ప్రజాశక్తి- రాయచోటి ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని, ఓటు హక్కు కలి గిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ పిలుపునిచ్చారు. గురువారం రాయచోటి బంగ్లా వద్ద నున్న జూనియర్ కళాశాల మైదానంలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరిం చుకుని ఏర్పాటు చేసిన ఓటరు చైతన్య అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ కళాశాల మైదానం నుంచి బంగ్లా కూడలి, ఠాణా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే కూడలి మీదుగా మాసాపేటలోని సాయి శుభ కల్యాణ మండపం వరకు నిర్వహించారు. అనంతరం కల్యాణ మండ పంలో ఓటరుగా నమోదు కావాల్సిన ఆవశ్యకతపై అవగాహనా కార్యక్రమం నిర్వ చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన ఓ వరం అని, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరమూ జనవరి 25వ తేదీన ఓటు హక్కు పైనా, ప్రజా స్వామ్య వ్యవస్థపైనా ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా జాతీయ ఓటర్ల దినోత్సనాన్ని నిర్వహించారు. మరింత మంది యువ ఓటర్లను రాజకీయ ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్ల మన భవిష్యత్తును నిర్ణయిం చుకునే అధికారం, మన సంక్షేమాన్ని గురించి ఎంచుకునే హక్కు, ముఖ్యంగా ఒక మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకునే బాధ్యత ఇవన్నీ ఓటు హక్కు ద్వారా సాధించేవే అన్నారు. నోటు కోసం, మద్యం కోసం ఓటు హక్కు దుర్వినియోగం 18 సంవత్సరాలు దాటిన యువతీ యువకులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా దరఖాస్తు చేసుకొని నమోదు కావాలనీ ఓటు హక్కు, ప్రజా స్వామ్య వ్యవస్థపైనా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆర్‌డిఒ రంగస్వామి మాట్లాడుతూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజాస్వామ్యం బలపడాలంటే ఓటు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. బాధ్యత కలిగిన పౌరుడిగా ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారందరి చేత ఓటరుగా నమోదు అవుతామని ఓటు హక్కును వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. సందర్భంగా చాలా ఏళ్లుగా ఓటు హక్కును వినియోగించుకుంటున్న సీనియర్ సిటిజన్స్‌ను జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్, ఆర్‌డిఒ ఘనంగా సన్మానించారు. ఓటరుగా కొత్తగా నమోదైన యువ ఓటర్లకు ఎపిక్ కార్డులు అందజేశారు. ఓటరు జాబితాకు కషిచేసిన బిఎల్‌ఒలు, సూపర్‌వైజర్లు, విఆర్‌ఒలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ ప్రేమంత్ కుమార్, ఎంఇఇఒ వెంకట శివారెడ్డి, సుధాకర్ రెడ్డి, సాయి కళాశాల యాజమాన్యం శ్రీనివాసరాజు, కళాశాల, పాఠశాలల విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్, ప్రజలు పాల్గొన్నారు.
