ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎంను గెలిపించాలి

మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం

ప్రజాశక్తి-ఎటపాక :

పోలవరం నిర్వాసితులు, గిరిజనులు, ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎంకి మద్దతు తెలిపి రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం ప్రజలకు పిలుపునిచ్చారు. మండలంలోని తోటపల్లిలో ఆటిశెట్టి రాము అధ్యక్షతన గురువారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీతారాం మాట్లాడారు. నిర్వాసితుల సమస్యలు, పోడు భూముల సమస్యలు, గిరిజన, రైతు సమస్యలపై సిపిఎం పార్టీ అనేక పోరాటాలు చేసిందని, జీవో నెంబర్‌ 3 రద్దుకు వ్యతిరేకంగా ప్రజా, న్యాయపోరాటం చేసిందని గుర్తు చేశారు. బిజెపి, టిడిపి, వైసిపిలు నిర్వాసితులు, ఆదివాసీల సమస్యలపైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, ఆ పార్టీలకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. నిర్వాసితుల పక్షాన నికరంగా నిలబడి పోరాడుతున్న సిపిఎంను రంపచోడవరం నియోజకవర్గం నుండి గెలిపించి అసెంబ్లీకి పంపించాల్సిన అవసరం నేడు ఎంతో ఉందని చెప్పారు. ఈ నెల 9న నిరుద్యోగులు చేపట్టిన ఐటిడిఎ ముట్టడికి, 10న ఆదివాసీ గిరిజన సంఘాలు నిర్వహించే మన్యం బంద్‌కు సిపిఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి ఐవి, నాయకులు సొందే రామారావు, ఐ.పద్మ, సోయం వీరమ్మ, పొడియం రత్తమ్మ, జి హుస్సేన్‌, సవలం రాము పాల్గొన్నారు.

➡️