ప్రపంచ మార్గదర్శకుడు లెనిన్‌

లెనిన్‌ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వెంకట్రావు, సిఎస్‌ఆర్‌ ప్రసాద్‌ తదితరులు
ప్రజాశక్తి-గుంటూరు : ప్రపంచ వ్యాప్తంగా మితవాదం, పాసిజం పెరుగుతున్న తరుణంలో సోషలిస్టు సమాజం కోసం కృషి చేస్తున్న వామపక్ష, అభ్యుదయ వాదులు లెనిన్‌ను మరింత అధ్యయనం చేయాలని మార్క్సిస్టు మాసపత్రిక సంపాదకులు ఎస్‌.వెంకట్రావు అన్నారు. లెనిన్‌ రష్యాకే కాక ప్రపంచ మార్గదర్శకుడన్నారు. రష్యా విప్లవ మార్గదర్శకుడు లెనిన్‌ శతవర్థంతి సందర్భంగా ప్రజాశక్తి, సాహితీ స్రవంతి సంయుక్తంగా స్థానిక బ్రాడీపేటలోని పిఎల్‌.రావు భవన్‌లో సోమవారం ‘విప్లవ సారధి లెనిన్‌- జీవితం-కృషి’ పుస్తకాన్ని వెంకట్రావు ఆవిష్కరించారు. లెనిన్‌ క్యాలెండర్‌ను విరసం నాయకులు సిఎస్‌ఆర్‌ ప్రసాద్‌ ఆవిష్కరించారు. తొలుత లెనిన్‌ చిత్రపటానికి ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ పాపినేని శివశంకర్‌ పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం వివికె.సురేష్‌ అధ్యక్షతన జరిగిన సభలో వెంకట్రావు మాట్లాడుతూ లెనిన్‌ స్ఫూర్తితో ప్రస్తుతం దేశంలో సమకాలీన పరిస్థితుల్ని సక్రమంగా అర్థం చేసుకొని, మార్క్సిస్టు సిద్ధాంతాన్ని జోడించి సోషలిస్టు విప్లవం తీసుకురావటానికి ఉన్న మార్గాలను అధ్యయనం చేయాలన్నారు. రష్యాలో మాదిరిగా భారతదేశంలో ప్రజాతంత్ర విప్లవం రాకుండా, సోషలిస్టు విప్లవం సాధ్యం కాదని చెప్పారు. మార్క్సిజాన్ని తాజాపర్చడం ద్వారా లెనిన్‌ రష్యాకే కాక ప్రపంచం మొత్తానికి మార్గనిర్దేశం చేశారన్నారు. సిఎస్‌ఆర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ లెనిన్‌ వ్యూహరక్త, తత్వవేత్తే కాక గొప్ప సాహితీ వేత్త అని, ఆచరణవాది అన్నారు. మార్క్సిజం పట్ల తప్పుడు భావన ప్రజల్లో కల్పించటానికి సిఐఎ, ఎఫ్‌బిఎ వంటి సంస్థలు పెద్ద ఎత్తున కృషి చేస్తూనే ఉన్నాయన్నారు. అభ్యుదయ వాదులు, వామపక్ష వాదులు భావజాల పున:అధ్యయనం చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక జిల్లా అధ్యక్షులు ఎస్‌.హనుమంతరెడ్డి, అరసం నాయకులు శరత్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, సిపిఐ (ఎఎంల్‌) రెడ్‌స్టార్‌ పొలిట్‌బ్యూరో సభ్యులు మన్నవ హరిప్రసాద్‌, సిపిఐ (ఎంఎల్‌) నాయకులు వేల్పూరి నరసింహారావు పాల్గొన్నారు.

➡️