ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలి

ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలి

ప్రజాశక్తి-గోపాలపురంజగన్మోహన్‌ రెడ్డి మొద్దు నిద్ర వీడి ప్యాలెస్‌ నుంచి బయటకు వచ్చి నష్టపోయిన రైతన్నలకు అండగా నిలవాలని గోపాలపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి మద్దిపాటి వెంకట్రాజు డిమాండ్‌ చేశారు. గురువారం మండలంలోని పెద్దాపురంలోని రైతు కొర్లపాటి అన్నవరానికి చెందిన 20 ఎకరాల్లో కుళ్లిపోయిన పొగాకు తోటలను మద్దిపాటి వెంకటరాజు, టిడిపి నాయకులు పరిశీలించారు. అనంతరం వెంకటరాజు మాట్లాడుతూ ఇటీవల అకాల తుపాను కారణంగా రైతులకు అపార నష్టం జరిగిందన్నారు. ప్రకతి విపత్తు ఒక కారణమైతే రెండోది ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అన్నారు. కాలువలు, చెరువులు పూడికలు తీయక పోవడంతో వర్షపు వరద నీరు ఒక గమ్యం లేకుండా పొలాల మీద విరుచుకు పడడంతో పొలాలు కొట్టుకుపోవడం, తోటలు కుళ్లిపోవడం పంట నష్టం వాటిల్లిందన్నారు. పొగాకు తోటలు కుళ్లిపోవడంతో రైతులకు ఎంతో నష్టం వాటిల్లిందన్నారు. సిఎం వైఎస్‌.జగన్‌ మొద్దు నిద్ర వీడి క్షేత్రస్థాయిలోకి వచ్చి పొగాకు బోర్డు అధికారులతో, వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి రైతులకు పంట పెట్టుబడికి రుణాలు ఇప్పించి, పంట నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కొర్లపాటి రాము, గన్నిన మురళి, రొంగల సత్యనారాయణ, జ్యేష్ట శ్రీనివాస, శ్రీధర్‌, మద్దిపాటి రమేష్‌, పరిమి జగదీష్‌, దొరబాబు పాల్గొన్నారు.

➡️