అధ్వానరోడ్డుతో నిత్యం అవస్థలు.. పట్టని నేతలు, అధికారులు
ప్రజాశక్తి -హుకుంపేట:అధ్వాన రహదారితో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని సంపంగిపుట్టు గ్రామపెద్ద కేశవరావు, వైస్ ఎంపిపి సూడిపల్లి కొండలరావుతోపాటు గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. సోమవారం రాత్రి మండలంలోని దుర్గం పంచాయితీ సంపంగిపుట్టు వెళ్తున్న టిప్పర్ లారీ బోల్తాపడిన నేపథ్యంలో వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. కేశవరావు మాట్లాడుతూ సంపంగిపుట్టు, రణంకోట గ్రామాలకు సరైన రోడ్డు లేకే ప్రమాదం జరిగిందన్నారు. గతంలో వేసిన మట్టి రోడ్డు వర్షాలకు కొట్టుకుపోయి, రాళ్లు తేలిపోయి నడవడానికే ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం హామీనిచ్చిన నేతలు తర్వాత మరిచిపోతున్నారని, ఇప్పటికైనా స్పందించాలని కోరారు. వైస్‌ఎంపిపి సూడిపల్లి కొండలరావు మాట్లాడుతూ, రణంకోట, సంపంగిపుట్టు గ్రామాల్లోని వారంతా ఆదివాసీ గిరిజనులే కావడంతో ప్రభుత్వం, నేతలు, అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపించారు. పివిటిజి గ్రాంటుతోనైనా తారురోడ్డునిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.
రణంకోట, సంపంగిపుట్టు రోడ్డులో బోల్తా పడిన టిప్పర్