‘ప్రయివేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి’

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ ఒంటిపూట బడుల నిబంధనలు తుంగలో తొక్కుతూ ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా పాఠశాలలు నడుపుతున్న శ్రీసాయి విద్యాలయ, భారతీయ విద్యానికేతన్‌, అక్షర పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సర్వేపల్లి నరసింహ, పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షులు నేతి నాగేశ్వర డిమాండ్‌ చేశారు. ఒంటిపూట బడుల సమయం లో నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నడుపుతున్నారంటూ బుధ వారం ఎంఇఒ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో సాధారణం కంటే తీవ్రస్థాయిలో మండుటెండలు విరుచుకుపడుతున్న సమయంలో విద్యార్థుల భద్రతను దష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నెల 19వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తుంటే కొన్ని ప్రయివేటు పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నడుపుతున్నారని ఆరోపించారు. విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నా విద్యాశాఖ అధికారులు పాఠశాలలపై శాఖప రమైన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడంలో అనంత జయం ఏమిటో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. తక్షణమే మండల, జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణగా కార్పొరేట్‌, ప్రయివేట్‌ పాఠశాలల ఆగడాలపై పెద్ద ఎత్తున నినదిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు శివమణి, మనోహర్‌, గౌరీ శంకర్‌, చెంగయ్య పాల్గొన్నారు.

➡️