ప్రాధాన్యత రంగాలపై బ్యాంకులు దృష్టి పెట్టాలి

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి

ప్రజాశక్తి- అనకాపల్లి

జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలంటే బ్యాంకులు ప్రాధాన్యత రంగాలైన వ్యవసాయం, చిన్నపరిశ్రమలు, స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై మరింత దృష్టి సారించాలని జిల్లా కలెక్టరు రవి పట్టన్‌శెట్టి ఆదేశించారు. కలెక్టరు కార్యాలయంలో గురువారం నిర్వహించిన డిసిసి, డిఎల్‌ఆర్‌సి మూడవ త్రైమాసిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయం ప్రధాన రంగంగా వుందని, కాబట్టి వ్యవసాయం అనుబంధ రంగాలకు స్వల్పకాలిక రుణాలను ఎక్కువగా మంజూరు చేయాలని సూచించారు. తోటలు, కూరగాయలు, పశు సంవర్ధక, డెయిరీ, మత్స్య పరిశ్రమలలో కాలానుగుణంగా ఉత్పత్తి సాధించే రంగాలకు ఆర్ధిక చేయూత నివ్వాలని కోరారు. ఆయా శాఖల అధికారులు, బ్యాంకు అధికారులు సమన్వయంతో వ్యవసాయ, అనుబంధ రంగ రైతులను ప్రోత్సహించాలని ఆదేశించారు. లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ సత్యనారాయణ రుణ ప్రణాళిక అమలు నివేదికను పవర్‌ పాయంట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.5088.12 కోట్లు ఎంఎస్‌ఎంఈకి రూ.1566.9 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అనంతరం ఆర్‌బిఐ ఎజియం ఆర్‌కె.హనుమకుమారి వివిధ బ్యాంకుల ద్వారా అమలు చేస్తున్న రుణాలను సమీక్షించారు. ఈ సమావేశంలో యూనియన్‌ బ్యాంక్‌ ప్రాంతీయ అధికారి పి.నరేష్‌, నాబార్డ్‌ డిడియం సమంత్‌ కుమార్‌, మెప్మా పిడి ఎన్‌.సరోజిని, కెవిఐబి ఏడి, వి.పద్మ, ఎపిటిడ్కో డిఈఈ బి.సంధ్య, పశు సంవర్ధక శాఖ టెక్నికల్‌ అధికారి పి.భానుబాబు, మత్స్యశాఖ డిడి పి.ప్రసాద్‌, ఉద్యానవన శాఖ అధికారి జి.ప్రభాకారరావు, డిఐసి ఏడి జి.జోగినాధ్‌, డిసిసిబి సిఈఓ డివియస్‌ వర్మ, ఇతర బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

➡️