ప్రజాశక్తి – కడప ప్రతినిధి/ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్ప్రొద్దుటూరును ప్రశాంత వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దుతానని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం కడప జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలో ప్రజాగళం సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొద్దుటూరులో నియంత పాలన సాగుతోందన్నారు. ఇసుక దందా దగ్గర నుంచి బెట్టింగ్, మట్కా, గుట్కా, గంజాయి, బియ్యం, డీజిల్ మాఫియా, సెటిల్మెంట్స్, కమీషన్లు, నకిలీ నోట్లు వంటి అసాంఘిక వాతావరణం రాజ్యమేలుతోందని చెప్పారు. జిల్లాలోని కడప, పులివెందులకు ఒక్క పరిశ్రమా రాలేదని చెప్పారు. కడప ఉక్కు పరిశ్రమకు రెండు సార్లు శంకుస్థాపనలు చేశారని, ఐదేళ్లవుతున్నా ఒక్క ఇటుకా పేర్చలేదని తెలిపారు. కడప పార్లమెంట్ బరిలో వివేకా హత్య కేసులో నిందితుడైన అవినాష్‌రెడ్డిని పోటీ పెట్టి ఓట్లు వేయమంటావా, నిర్ధోషిగా తేలే వరకు బయటే ఉంచడం తెలియదా అని నిలదీశారు. బుల్లెట్‌లాంటి భూపేష్‌రెడ్డి నిలబెట్టానని, ఆలోచించి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. ముస్లిములూ జగన్ మాట వినొద్దని విజ్ఞప్తి చేశారు. చిన్నాన్న హత్య కేసులో సిబిఐ అధికారులపైనే కేసులుపెట్టి తప్పుడు మాటలు మాట్లడతావా అంటూ ఎద్దేవా చేశారు. ఇటువంటి నాయ కునికి ఓట్లు వేస్తే ఎవరికీ రక్షణ ఉండదని హెచ్చరించారు. ప్రొద్దుటూరులో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో 160 అసెంబ్లీ సీట్లు, 25 ఎంపీ సీట్లను గెలుచుకుంటామని ధీమాను వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు ఓ ముల్లుగా మారి దోచుకుంటున్నాడని విమర్శించారు. బిసిలు ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు. నందం సుబ్బయ్యను దారుణంగా హత్య చేశారన్నారు. ఒంటిమిట్టలో ఓ చేనేత కుటుంబాన్ని వైసిపి నాయకుల ఆరాచకాలకు బలైందని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆడబిడ్డలకు రూ.1500, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పేరుతో విద్యార్థుల తల్లిఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తామని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, 90 శాతం సబ్సిడీతో బిందుసేద్యం పరికరాలు, మెగా డిఎస్సీ, ఇంటింటికీ తాగునీరు, 50 ఏళ్లు నిండిన బిసిలకు పెన్షన్, రాష్ట్రాన్ని ప్రపంచంతో అనుసంధానిస్తామని వంటి హామీల వరద పారించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రవీణ్ కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ లింగారెడ్డి, ముక్తియార్ గుర్తింపు, గౌరవం ఇస్తామని తెలిపారు. అనంతరం సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షులు కొనిరెడ్డి శివచంద్రారెడ్డికి పార్టీ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజులరెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరు అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్య మన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల అఫిడవిట్లో రూ.2.30 కోట్లు ఆస్తి చూపిన రాచమల్లు, రూ.150 కోట్లకు ఎలా చేరుకుందో చెప్పాలని నిలదీశారు. రూ.516 కోట్లతో చేసిన శంకుస్థాపనలకు ఒక్క అడుగు ముందుకు పడలేదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ అభ్యర్థి భూపేష్‌రెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పేరుతో పేదలను ఆదుకునే ప్రయత్నం చేస్తామన్నారు. డిప్లమా, ఇంజినీరింగ్ చదివిన యువతకు సాఫ్ట్వేర్ వంటి ఉద్యోగావకాశాలు చంద్రబాబు దూర దృష్టితోనే సాధ్యమైందని గుర్తు చేశారు. ఆయన దూరదృష్టితోనే సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో రెవెన్యూ జనరేట్ అయిందని చెప్పారు. హెలిపాడ్ వద్ద టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి, కడప అసెంబ్లీ అభ్యర్థి మాధవి, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రాజంపేట అభ్యర్థి సుబ్రమణ్యం కలిశారు. కార్యక్రమంలో సిఎం సురేష్‌నాయుడు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
