16మందికి అస్వస్థత
గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు
అదుపులోనే ఉంది : డిఎంహెచ్‌ఒ
ప్రజాశక్తి- బొండపల్లి : విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని బిల్లలవలస గ్రామంలో అతిసార సోకింది. ఈనెల 16నుంచి 20వ తేదీ వరకు 16 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. వీరిలో కొందరు జిల్లాకేంద్ర ప్రభుత్వాస్పత్రిలోను, ఘోషాస్పత్రి, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. ఈనెల 18న ముగ్గురు డయేరియా బారినపడ్డారు. ఆదివారం ఐదుగురు, సోమవారం 8మంది ఆ వ్యాధి బారిన పడ్డారు. విషయం తెలుసుకున్న వైద్యాధికారులు ఆదివారం గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద వైద్యబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలందిస్తున్నట్లు స్థానిక పిహెచ్‌సి వైద్యాధికారి లెంక సత్యనారాయణ, డాక్టర్ జి.సమీర తెలిపారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో నిల్వ ఉన్న మాంసం, బిరియానీ తినడం వల్ల డయేరియా సోకిందని తెలిపారు. అయితే ఇది వాస్తవం కాదని గ్రామస్తులు చెబుతున్నారు. వీరంతా ఒకోచోట, ఒకే ఆహారం తినలేదని, నీటి కలుషితం వల్లే డయేరియా ప్రబలిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు గ్రామంలో తాగునీటిని తనిఖీ నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. డయేరియా బారిన పడిన వారిలో పత్తిగుళ్ల దీపిక, (11) నక్కాన పైడమ్మ (75), వెంపటాపు పైడితల్లి (65) జిల్లా కేంద్రంలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సుంకర అప్పలనాయుడు, రౌతు చరణ్‌తేజ, పత్తిగుళ్ల రాజశేఖర్, ఇప్పర్తి సీతమ్మ, పత్తిగుళ్ల బంగారమ్మ, పత్తిగుళ్ల అప్పారావు, పత్తిగుళ్ల గౌరి, పతివాడ సూర్యకళ, బోర అప్పన్న, రౌతు అప్పయ్యమ్మ, ఎర్ని యామిని, గంట కృష్ణమ్మ, సంకర అప్పయమ్మ గ్రామంలోని వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువరు కోలుకొని ఇళ్లకు వెళ్లిపోగా మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న డిఎంహెచ్‌ఒ జీవనరాణి, జెడ్‌పి సిఇఒ సత్యనారాయణ, డిపిఒ టి.వెంకటేశ్వరరావు, ఎంపిడిఒ గిరిబాల, తహశీల్దార్ రాజశ్వేరరావు, ఇఒపిఆర్‌డి ఎ.రఘుపతిరావు, పంచాయతీ కార్యదర్శి రమాకుమారి, సోమవారం గ్రామాన్ని సందర్శించి రోగులను పరామర్శించారు. పరిస్థితిని తెలుసుకున్నారు. సర్పంచ్ నెట్టి ఏసురత్నం దగ్గరుండి పర్యవేక్షించారు.
ఇంటింటికీ వెళ్లి వ్యాధిగ్రస్తుల గుర్తింపు : డిఎంహెచ్‌ఒ డాక్టర్ జీవనరాణి
జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఆదేశాల మేరకు సోమవారం బిల్లలవలస గ్రామాన్ని డిఎంహెచ్‌ఒ జీవనరాణి సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. డయేరియా అదుపులోనే వుందని చెప్పారు. గ్రామ ప్రజల్లో భయాందోళనలు పోగొట్టేందుకు గ్రామంలోనే వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని, 24 గంటలూ పనిచేసేలా ఈ శిబిరంలో ఇద్దరు వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించామన్నారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి డయేరియా లక్షణాలు వున్న వారిని వైద్య సిబ్బంది గుర్తిస్తున్నారని చెప్పారు. గ్రామంలో రాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేశామని, గ్రామంలో ప్రతి ఇంట్లో పాట్ క్లోరినేషన్ తో పాటు తాగునీటి వనరుల క్లోరినేషన్ కూడా చేపట్టామన్నారు. పలువురు గ్రామస్థులతో మాట్లాడి డయేరియా చికిత్సకు అన్ని చర్యలు చేపట్టామని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం గ్రామానికి చెందిన ముగ్గురు మాత్రమే ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారికి కూడా ప్రాణాపాయం ఏమీ లేదని చెప్పారు. గ్రామంలో ప్రస్తుతం కొత్తగా డయేరియా కేసులు ఏవీ నమోదు కాలేదన్నారు.