మత్స్యకారుని మృతి ఘటనలో ఆరోపణలు అవాస్తవం

మాచర్ల: వెల్దుర్తి మండలం బంగారు పంట తండాకు చెందిన మత్స్యకారుడు దుర్గారావు మృతిపై పోలీసుల వేధింపులే కారణమని చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవమని రూరల్‌ సీఐ సమీముల్లా అన్నారు. స్థానిక రూరల్‌ సీఐ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దుర్గారావు ను కొంతమంది రాజకీయ ప్రలోభాలకు వాడు కొని లబ్ధి పొందేందుకు పోలీసులపై అసత్య ఆరోపణలు చేశారని అన్నారు. దుర్గారావు ఆదివారం తెల్లవారుజామున చేపల వేటకు బయలుదేరి తన మరపడవను స్టార్ట్‌ చేయగా తాడు దానికి చుట్టుకుని ప్రమాదవశాత్తు మెడకు చుట్టుకోవడంతో అతను చనిపోయాడని, తమ కు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలిసిం దన్నారు. దుర్గారావు తెలంగాణ మద్యం తీసుకు వచ్చి ఆ ప్రాంతంలో అమ్ముతుండటంతో అతనిపై కేసులు నమోదయ్యాయని, ఆ యా కేసులలో అతను హైకోర్టుకు వెళ్లి బెయిల్‌ తెచ్చుకున్నట్లు చెప్పారు. నిబంధన ప్రకారం స్టేషన్‌ లో నెలకు మూడుసార్లు సంతకాలు పెట్టాల్సి ఉందని, ఆదివారం కూడా అతను సంతకం పెట్టాల్సి ఉందన్నారు. గత రెండు వాయిదాలకు అతను సంతకాలు పెట్టేందుకు రాలేదని, మూడోసారి సంతకం పెట్టేందుకు రావాలని విధులలో భాగంగా పోలీసులు అతనికి సమాచారం ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. పోలీసులు ఎప్పుడు ఎవరిని తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరాలని గాని, ఆ కండువా తీసేసి ఈ కండవా కప్పుకోమని బెదిరించడం కానీ చేయలేదని స్పష్టం చేశారు. ఈ కేసులో పూర్తి విచారణ జరుగుతోందని, దుర్గారావు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తందని చెప్పారు. మృత దేహాన్ని నదిలోంచి బయటకు తీసినప్పుడు వారు మాట్లాడిన మాటలు తర్వాత మృత దేహాన్ని తీసుకువచ్చి వెల్దుర్తి స్టేషన్‌ ముందు పెట్టి ఆందోళనకు దిగినప్పుడు మాట్లాడిన మాటలు చూస్తే స్థానికంగా ఉన్న కొందరు తెలుగుదేశం నాయకులు తమ స్వలాభం కోసం చేసిన పని అని అర్థమవుతోందన్నారు నిజా నిజాలు త్వరలోనే అన్ని తేలుస్తామని, కేసులు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణ సీఐ శరత్‌ బాబు మాట్లాడుతూ ఈ కేసు పట్టణ సిఐగా ఉన్న నాకు అప్పగించడం జరిగిందని నిష్పక్షపాతంగా విచారణ జరుపుతామన్నారు.

➡️