మన్యం టిడిపిలో ముసలం!

మన్యం టిడిపి

అభ్యర్థుల ఖరారుపై భగ్గుమంటున్న పార్టీ శ్రేణులు

సీనియర్లకు ఛాన్సివ్వకుంటే ఓడిస్తామని హెచ్చరిక

పోటాపోటీగా సదస్సులు, సమాలోచనల్లో నేతలు

ప్రజాశక్తి-పాడేరు: సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలై, పోటీ అభ్యర్థుల ఖరారుతో మన్యం తెలుగుదేశం పార్టీలో ముసలం నెలకొంది. టిక్కెట్లు కేటాయింపు తీరుపై టిడిపి శ్రేణులు తీవ్ర వ్యతిరేకత, నిరసన వ్యక్తం చేస్తున్నారు. అరకు, పాడేరు ఎమ్మెల్యే స్థానాల్లో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జిలకు పార్టీ అధిష్టానం మొండిచేయి చూపడంపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. శనివారం పాడేరులో నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, సీనియర్‌ నాయకులు మాజీ మంత్రి మణికుమారి తదితరులు వేర్వేరుగా మీడియా సమావేశం నిర్వహించి అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం తీరును దుయ్యబట్టారు.టిడిపి సీనియర్‌ నేత, మాజీ మంత్రి మణికుమారి, ఇతర నేతలు ఎంవీఎస్‌ ప్రసాద్‌, కొట్టగుల్లి సుబ్బారావు, వంజంగి కాంతమ్మ, బొర్రా నాగరాజు, విజయరాణి తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, పార్టీలో కనీసం అర్హత లేని వ్యక్తికి టికెట్‌ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. టిడిపి పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించిన రమేష్‌నాయుడు పార్టీలోకి వచ్చి మూడు నెలలే అయిందని, ఏం అర్హతలు చూసి అతనికి టిక్కెట్‌ కేటాయించారో చెప్పాలన్నారు. రమేష్‌ నాయుడు దగ్గర భారీగా ముడుపులు తీసుకుని టికెట్‌ కేటాయించినట్లు కేడర్‌ సందేహం వ్యక్తం చేస్తోందన్నారు. దీనిపై పార్టీ పునరాలోచన చేసి సీనియర్లకే టికెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేసారు. టిడిపి డబ్బులకు ఆశించే టికెట్లు కేటాయిస్తోందన్న అపవాదు రాకుండా అధిష్టానం మేలుకోవాలన్నారు. పాడేరు నియోజకవర్గంలో ఎన్ని పంచాయతీలు, ఎన్ని బూత్‌ కమిటీలు ఉన్నాయో తెలియని వ్యక్తికి టికెట్‌ కేటాయించడం ఎంతమాత్రం సరికాదన్నారు. అధినేత చంద్రబాబుకు తప్పుడు నివేదిక సమర్పించి టికెట్టు పొందారన్నారు.పార్టీ బి-ఫారం ఇచ్చేంతవరకు తమ ప్రయత్నాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గిడ్డి ఈశ్వరి వేరుగా మీడియాతో పార్టీ కోసం సుదీర్ఘకాలంగా సేవ చేస్తున్న తనకు టికెట్‌ కేటాయించకపోవడంపై కన్నీటి పర్యంతమయ్యారు. ఏళ్ల తరబడి పార్టీ కోసం తాను కష్టపడితే, ఏ సర్వే ప్రకారం రమేష్‌ నాయుడుకు టిక్కెట్‌ కేటాయించారని ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు.. తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తి రమేష్‌నాయుడు లాబీయింగ్‌ చేసి టికెట్‌ పొందారని ఆరోపించారు. అధిష్టానం పునరాలోచన చేసి టికెట్‌ తనకు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్‌ చేశారు. లేదంటే టిడిపి అభ్యర్థి రమేష్‌నాయుడును కచ్చితంగా ఓడించి తీరుతామని స్పష్టం చేశారు

 మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్న  ఈశ్వరి

➡️