మహాధర్నాను జయప్రదం చేయండి

ప్రజాశక్తి – మంగళగిరి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ కర్షక, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 27, 28 తేదీల్లో విజయవాడలో జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని రైతుసంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు పిలుపునిచ్చారు. పట్టణంలోని సంఘం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్‌ అనుకూల పంటల బీమా పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, సమగ్ర ప్రభుత్వ రంగ పంటల బీమా సంస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ఢిల్లీలో రైతు ఉద్యమం సందర్భంగా అమరులైన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, కేసులను ఉపసంహరిం చుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతు రుణాలను రద్దు చేసి కేరళ తరహా రైతు రుణ ఉపశమన చట్టాన్ని తేవాలని, ఆత్మహత్యలను నివారించాలని కోరారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించి పునరావసం కల్పించా లన్నారు. సమావేశంలో రైతు సంఘం నాయకులు వి.భారతి, జి.నాగేశ్వరావు, బి.జానారెడ్డి, ఎ.సాంబిరెడ్డి, గోపాల్‌రెడ్డి, ఎ.ప్రకాష్‌రావు, ఎస్‌.రామిరెడ్డి, బి.సత్యమారెడ్డి పాల్గొన్నారు.ప్రజాశక్తి – ఫిరంగిపురంమహాధర్నా జయప్రదం కోసం మండల కేంద్రమైన ఫిరంగిపురంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ బిజెపి పాలనలో మొత్తం దేశమే అస్తవ్యస్తంగా తయారైందని, ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతోందని విమర్శించారు. వ్యవసాయన్ని దెబ్బతీసి ఆహార భద్రతకు ముప్పు తెస్తోందని, కార్మికుల హక్కులను కాలరాసేలా లేబర్‌ కోడ్‌లు తెచ్చిందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతోందని, పోరాటాలపై ఉక్కుపాదం మోపుతోందని, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తోందని అన్నారు. వీటికి వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటీ అమలు చేయాలని, పంటలకు స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం గిట్టుబాటు ధర అమలు చేయాలని స్కీమ్‌ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరారు. ప్రజలకు రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌, రూ.60కు లీటరు ఇంధనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి షేక్‌ మస్తాన్‌వలి, రైతు సంఘం నాయకులు ఎం.వెంగల్‌రెడ్డి, సిహెచ్‌ వెంకటేశ్వర్లు, ప్రసాద్‌, బిక్షాలు, థామస్‌ పాల్గొన్నారు.

➡️