మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేయండి

సమావేశంలో మాట్లాడుతున్న యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు శ్రీలక్ష్మి

ప్రజాశక్తి-అనకాపల్లి

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షురాలు వత్సవాయి శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు. శ్రామిక మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ సిహెచ్‌.రూపాదేవి అధ్యక్షతన అనకాపల్లి సిఐటియు ఆఫీసులో గురువారం మహిళా దినోత్సవ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ అంతరిక్షంలోకి ఒకవైపు మహిళలు అడుగు పెడుతుంటే, మరోవైపు రోజురోజుకూ మహిళలపై అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు, గృహహింస పెరిగిపోయాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచీకరణ నేపథ్యంలో మహిళను వ్యాపార సరుకుగా చూస్తున్నారని, అశ్లీల సాహిత్యం, వ్యాపార ప్రకటనలతో మహిళలు, బాలికలపై మరింత లైంగిక వేధింపులు పెరిగాయని పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8 నుండి 15వ తేదీ వరకు సభలు, సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించాలని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ, సిఐటియు, ఐద్వా, యుటిఎఫ్‌ సంయుక్తంగా పిలుపునిచ్చినట్లు చెప్పారు. ఈ సమావేశంలో శ్రామిక మహిళా సమన్వయ కమిటీ నాయకులు తనూజ, కాసులమ్మ, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పి.మాణిక్యం, నాయకులు డిడి వరలక్ష్మి పాల్గొన్నారు.

➡️