‘మీడియా-సామాజిక న్యాయం’ పై సదస్సు

 ప్రజాశక్తి-సీతమ్మధార : అంబేద్కర్‌ మెమోరియల్‌ సొసైటీ ఆధ్వర్యాన అంబేద్కర్‌ భవన్‌లో శనివారం ‘మీడియా-సామాజిక న్యాయం’ అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సు ప్రారంభంలో అంబేద్కర్‌ చిత్రపటానికి అతిథులు, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రముఖ రచయిత, కవి, ఏపీ జర్నలిజం కాలేజీ డైరెక్టర్‌ సతీష్‌ చందర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పత్రికలు వాస్తవాన్ని వక్రీకరిస్తూ నిజాన్ని మరుగునపడేటట్లు చేస్తున్నాయన్నారు. ప్రచార మాధ్యమాలు బలవంతంగా తమ అభిప్రాయాలను మనమీద రుద్దుతున్నాయని అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా అనేక అకృత్యాలు ప్రస్తుతం మీడియాలో కానరావట్లేదన్నారు. దళితుల బతుకులు, వారి జీవితాలు పత్రికల్లో కనిపించట్లేదన్నారు. అగ్రవర్ణాల చేతుల్లో ఉన్న కొన్ని పత్రికలు పార్టీలకు కొమ్ము కాస్తూ వారిని రాజకీయంగా ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో దళితులను చైతన్యవంతం చేసేందుకు అంబేద్కర్‌ మూక్‌ నాయక్‌ పత్రికను స్థాపించారని తెలిపారు. మతోన్మాద పార్టీలు దేశమంతా దేశభక్తి అంటే రామభక్తి అని ప్రచారం చేస్తున్నాయన్నారు. ప్రధాన మీడియా ఇదే చూపిస్తోందని విమర్శించారు. బహుజనులు ప్రచార మాధ్యమాల ద్వారా అంబేద్కర్‌ ఆశయాలను సాధించాలని పిలుపునిచ్చారు. ఏయూ జర్నలిజం విభాగం పూర్వ విభాగాధిపతి ప్రొఫెసర్‌ పి.బాబివర్ధన్‌ మాట్లాడుతూ, ‘మూక్‌ నాయక్‌’ పత్రికను అగ్రవర్ణాల పత్రికలకు ధీటుగా ఆనాడు అంబేద్కర్‌ నడపడం సాహసోపేతమని కొనియాడారు. నేడు మీడియా ఫోర్త్‌ ఎస్టేట్‌గా కాకుండా రియల్‌ ఎస్టేట్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘లీడర్‌’ సంపాదకులు వీవీ.రమణమూర్తి మాట్లాడుతూ, నేడు మతవాదులు అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని తీసివేసి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నారని, అందరూ జాగరూకతతో వ్యవహరించి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సొసైటీ అధ్యక్షులు బొడ్డు కల్యాణరావు మాట్లాడుతూ బ్రిటిష్‌ కాలంలోనే దేశానికి జర్నలిజం వచ్చిందని, అది అంబేద్కర్‌ అందిపుచ్చుకొని ఆనాటి బలహీన వర్గాల సమస్యలను వెలుగులోకి తెచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రధాన కార్యదర్శి జెవి.ప్రభాకర్‌ సీనియర్‌ జర్నలిస్ట్‌ జికెడి.ప్రసాద్‌, ఏయూ ప్రొఫెసర్‌ పీడీ సత్యపాల్‌, డాక్టర్‌ ప్రసాద్‌, ప్రొఫెసర్‌ ప్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు.

 

➡️