ముంపువాసుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా..?

ప్రజాశక్తి – కొండాపురం ప్రజల సమస్యలు, ముఖ్యంగా గండికోట ముంపువాసుల సమస్యలు నేటి పాలకులకు పట్టవా అని జమ్మలమడుగు టిడిపి ఇన్‌ఛార్జి చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి ప్రశ్నించారు. గండికోట ముంపు వాసుల సమస్యలు తెలుసుకోవడానికి ఆయన బుధవారం మండలంలోని ఎర్రగుడి గ్రామం నుండి కొండాపురం వరకు దాదాపుగా 21 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అనంతరం సాయంత్రం కొండాపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భూపేష్‌రెడ్డి మాట్లాడుతూ గండికోట ప్రాజెక్టు వల్ల ప్రజల జీవితాలు మెరుగ వుతాయని భావించారని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం కొండాపురం మండల ప్రజలు భూములు, ఇళ్లు త్యాగం చేశారన్నారు. ఎలాంటి ఆటంకం కలగకుండా సహాయపడ్డారని తెలిపారు. ముంపు వాసులకు చంద్రబాబు ప్రభుత్వంలో పునరావాస పరిహారం కింద రూ.6.75 లక్షలు పంపిణీ చేశారు. అనంతరం 2019 ఎన్నికల సందర్భంగా వైసిపి దానికి అదనంగా మరో మూడు లక్షల 25 వేల రూపాయలు ఇస్తామని చెప్పి, ఇంతవరకు ఇవ్వ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక తాళ్ల ప్రొద్దుటూరు, ఎర్రగుడి, చామ లూరు గ్రామాలను ఉన్నఫళంగా ఖాళీ చేయించారే కానీ.. వారి జీవన విధా నం, పరిహారం చెల్లింపు, కనీస వసతుల కల్పన వంటికి నేటి పాలకులు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఇప్పటివరకు పునరావస కాలనీలో రోడ్లు, డ్రయినేజీలు, నీటి సరఫరా, చివరికి శ్మశాన వాటికల ఏర్పాటు కూడా చేయలేదని వైసిపి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో మట్టి, ఇసుక అమ్మకాలు ఎక్కువైపోయాయన్నారు. కాంట్రాక్టర్ల వద్ద నుండి కమీషన్లు తీసుకోవడం వల్ల అభివృద్ధి కుంటుపడిందని భూపేష్‌రెడ్డి ఆరోపించారు. రాబోయే 2024 ఎన్నికల్లో జమ్మలమడుగు ఎమ్మెల్యేగా తనను, ముఖ్యమంత్రిగా చంద్రబాబును గెలిపిస్తే ముంపువాసుల సమస్యలు ఆరునెలల్లోపు పరిష్కరిస్తామని భూపేష్‌రెడ్డి తెలిపారు. అంతేకాక ఆరు గ్యారెంటీలను కూడా అమలు చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్సీ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పెన్నా నది ఒడ్డున ఉన్న 10 గ్రామాల ప్రజల సౌకర్యార్థం ఆ నదిపై లోలెవల్‌ బ్రిడ్జి శంకుస్థాపన చేస్తే దాని నిర్మాణం ఇప్పటివరకు పూర్తి చేయకపోవడం ప్రభుత్వం వైఫల్యమని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, టిడిపి నియోజకవర్గ పరిశీలకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️