రంపచోడవరంలో సిపిఎం విజయం ఖాయం

మాట్లాడుతున్న సిపిఎం ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌

ప్రజాశక్తి-కూనవరం

రానున్న ఎన్నికల్లో రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి సిపిఎం అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌ అన్నారు. మండల కేంద్రంలోని మార్తా శ్రీరామ్మూర్తి భవన్‌లో శుక్రవారం జరిగిన సిపిఎం జనరల్‌ బాడీ సమావేశంలో కిరణ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన సీపీఎంకు మాత్రం ఓటు అడిగే హక్కు ఉందన్నారు. వరదల సమయంలో ముంపు బాధితులకు సిపిఎం చేయుత అందించిందని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ వల్ల ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఏమి పట్టనట్లు వ్యవహారిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఓటు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైసిపి ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చట్ట సభల్లో పోరాడే ఒక గొంతుక రంపచోడవరం నియోజక వర్గం నుండి పంపించేందుకు సీపీఎం అభ్యర్థిని గెలిపించాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లోతా రామారావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను ప్రజా రక్షణ భేరి యాత్ర ద్వారా రాజకీయ అజెండాలోకి సిపిఎం తీసుకొచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ కొమరం పెంటయ్య, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పల్లపు వెంకట్‌, మేకల నాగేశ్వరరావు, మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, ఎంపీటీసీ జయసుధ, సర్పంచులు బొగ్గా వెంకమ్మ, సోడే శంకర్‌, తాళ్లూరి శ్రీనివాసరావు, కర్నాటి శ్రీనివాసరావు, సిపిఎం నాయకులు పాల్గొన్నారు.

➡️