రాయలసీమ ద్రోహి జగన్‌

రాష్ట్ర అభివృద్ధి కోసమే ఎన్‌డిఎతో కలయికఅధికారంలోకి రాగానే మదనపల్లిని జిల్లా చేస్తాం- మదనపల్లె ప్రజాగళం సభలో నారా చంద్రబాబు నాయుడుప్రజాశక్తి-మదనపల్లె రాయలసీమ ద్రోహి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే మదనపల్లిని జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు. బుధవారం రాత్రి స్థానిక బెంగళూరు బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వంపైన వ్యతిరేకతను ఓటురూపంలో చూపించి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో అంతిమ విజయం నిజాయతీదేనన్నారు. ముస్లింల జీవితాలను ఛిద్రం చేసిన ఘణత వైసిపిదేనన్నారు. బటన్‌ నొక్కే ముఖ్యమంత్రి బటన్‌ నొక్కిన తర్వాత ఎంత బొక్కాడో చెప్పాలని తెలిపారు. రావణాసుర పాలన అంతమయ్యే రోజులు దగ్గర పడ్డాయన్నారు. కరెంట్‌ బిల్లులు అమాంతం పెంచి పేదల రక్తాన్ని పీల్చే జలగను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. పెరిగిన కరెంట్‌, ఇంటిపన్నులు, పెట్రోల్‌, డీజిల్‌, రిజిస్ట్రేషన్‌ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు మనసులో పెట్టుకుని ఓటు వేయాలని కోరారు. నిరుద్యోగం పెరిగిపోయిందని జాబ్‌ కేలండర్‌ ఇస్తానని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే తామంతా మిత్రపక్షంగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు. మద్యానికి అలవాటు పడినవారు పగలంతా కష్టపడి రాత్రి అయితే సంపాదించిన డబ్బులు పెరిగిన మద్యం ధరలకు పెట్టి ఇంటికి ఏమీ తీసుకెళ్లలేక నరకయాతన పడుతున్నారని తెలిపారు. ఓట్ల కోసం అందరికీ మద్యం తాగిస్తారని ఆ మత్తులో ప్రజలు ఉంటే ఓట్లు వాళ్లే వేసుకుంటారన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం అందుబాటులో ఉంటుందన్నారు. అధికారులు ఇన్నాళ్లూ అధికార పార్టీకి సహాయపడ్డారని అయితే ఉన్న కొన్ని రోజులైనా పారదర్శకంగా పనిచేయాలని కోరారు. ప్రభుత్వంలో జీతాలు రాని పరిస్థితి ఉందని దాన్ని టిడిపి అధిగమించి అందరికీ సరైన సమయంలో జీతాలు అందజేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రం గంజాయి మత్తులో ఊగుతోందని మదనపల్లెలో కూడా గంజాయిని యువతకు అలవాటు చేశారన్నారు. తన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో జగన్మోహన్‌రెడ్డి లాంటి పనికిమాలిన ముఖ్యమంత్రిని చూడలేదని పేర్కొన్నారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులు ప్రవేశపెట్టి హంద్రీ-నీవా మొదలు పెట్టానని గుర్తు చేశారు. మదనపల్లె ప్రజలకు తాగు, సాగునీరు అందించే దిశగా తాను ఎంతో కృషి చేస్తే ఈ ఐదేళ్ల కాలంలో ఒక్క టిఎంసి నీరు కూడా ఇచ్చిన దాఖాలాలు లేవన్నారు. మైనార్టీలు అందరూ జనసేన, బిజెపి పొత్తుతో ఎవరికీ నష్టం కలగనివ్వనని హామీ ఇచ్చారు. గతంలో చేసిన అభివృద్ధికంటే ఈసారి మదనపల్లెలో షాజహాన్‌ బాషాను గెలిపిస్తే రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధి చేసి చూపిస్తాయన్నారు. సిద్ధం అంటున్నారు … దేనికి సిద్ధం.. ఓడిపోవడానికి వైసిపి సిద్ధమన్నారు. సొంత చెల్లిని గౌరవించలేని వాడికి రాష్ట్రంలోని ఆడపడుచులను ఎంత మాత్రం గౌరవిస్తాడో ఆలోచించాలని తెలిపారు. టిడిపి రాగానే విద్యుత్‌ భారం తగ్గిస్తామని, అన్నా క్యాంటీన్‌లు తెరచి పేదవాడికి అన్నం పెడతామని తెలిపారు. పాపాల పెద్దిరెడ్డి అన్నం తినడం మానేసి ఉదయం అల్పాహారం కింద ఇసుక, మద్యాహ్న భోజనం కింద మైనింగ్‌ రాత్రి భోజనానిని ఇరిగేషన్‌ ప్రాజెక్టులు తినేస్తున్నాడన్నారు. పుంగనూరుకు తండ్రి తంబళ్లపల్లికి చిన్నాన్న , రాజంపేటకు కొడుకు ఉండటానికి మీకేమైనా అన్నమయ్య జిల్లాను రాసి ఇచ్చేశారా అని ప్రశ్నించారు. హంద్రీనీవా డబ్బులను పక్కదారి పట్టిస్తున్నారని తానొస్తే అక్రమ కేసులు పెట్టించారన్నారు. మదనపల్లెలో భూకబ్జాలకు పాల్పడుతున్న వారిని అడ్డుకుని మదనపల్లెను కాపాడుతామన్నారు. కార్యక్రమంలో టిడిపి రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షులు జగన్‌మోహన్‌రాజు, మదనపల్లె, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లె, రాయచోటి టిడిపి అభ్యర్థులు షాజహాన్‌ బాషా, నల్లారి కిషోర్‌ కుమార్‌రెడ్డి, చల్లా రామచంద్రారెడ్డి, జయచంద్రరెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి, నాయకులు ఎస్‌.మస్తాన్‌, పఠాన్‌ఖాదర్‌ఖాన్‌, నాదెండ్ల విద్యాసాగర్‌, నాదెండ్ల శివన్న, శ్రీరామ్‌ చిన్నబాబు, ఆర్‌జెడి వెంకటేష్‌, పెద్ద ఎత్తున టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️