ప్రజాశక్తి-కలికిరి అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల కూటమి తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాయని పిసిసి మీడియా చైర్మన్ ఎన్.తుల సిరెడ్డి విమర్శించారు. కలికిరిలో పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి బాలిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుత వైసిపి ప్రభుత్వం డిబిటి ద్వారా రూ.1.85 వేల కోట్లు బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లో జమ చేసినట్లు జగన్ చెపుతున్నారని చెప్పారు. ప్రభుత్వం అప్పుల రూపేణా తెచ్చిన రూ.8.50 లక్షల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్‌టిసి, విద్యుత్ ఛార్జీల పెంపు, నాసిరకం మద్యం ధరల పెంపు, ఇసుక సిమెంట్ ధరల పెంపు, ఇంటి, చెత్త పన్నుల రూపేణా వచ్చిన ఆదాయం ఎంతో తెలపాలని డిమాండ్ చేశారు. ప్రజలకు రూ.10 పంచి వారి నుండి రూ.100 వసూలు చేసిన చెత్త ప్రభుత్వం జగన్‌రెడ్డిదని విమర్శించారు. రాష్ట్రం, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ డాక్టర్ శ్రీవర్ధన్ చౌదరి, కలికిరి మండల పార్టీ అధ్యక్షులు మల్లికార్జున, రాష్ట్ర ఒబిసి అధికార ప్రతినిధి వేంపల్లి శ్రీధర్, పుంగనూరు మండల అధ్యక్షులు బుడ్డా రెడ్డి, మదనపల్లె పార్టీ ఇన్చార్జ్ రెడ్డి సాహెబ్, పుంగనూరు టౌన్ అధ్యక్షులు మోసీనా, జిల్లా సెక్రటరీ మంగూ నాయక్, పీలేరు మండల అధ్యక్షులు దుబ్బా శ్రీకాంత్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
