రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

డ్వామా పీడీ ఎ.రాము

ప్రజాశక్తి – ముదినేపల్లి

తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, రైతులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వం సహకారం ఇస్తుందని డ్వామా పిడీ, మండల ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రత్యేక అధికారి ఎ.రాము అన్నారు. ఇటీవల తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు మండలంలో ముంపు బారిన పడిన వరి పొలాలను మండల స్థాయి అధికారులతో కలిసి ఆయన పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 14 వేల ఎకరాలలో రైతులు ఖరీఫ్‌ సాగు చేశారన్నారు. ఇప్పటివరకు 4 వేల ఎకరాలు మాత్రమే మాసూళ్లు పూర్తయినట్లు తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో కోతకు వచ్చిన వరిపైరు నేల వాలినట్లు చెప్పారు. వర్షాలకు చేలల్లో నీరు నిలిచిపోవడంతో వరి గింజలు మొలకలు వస్తున్నాయన్నారు. రైతులు ఎవరూ భయపడవద్దన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులను ఆదుకుంటూ పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించేందుకు, రైతులకు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే మండలంలో పంట నష్టం అంచనాలను అధికారులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఆయన వెంట మండల తహశీల్దార్‌ కె.శ్రీనివాస్‌, వ్యవసాయ శాఖ అధికారి వేణుమాధవ్‌, ఎపిఒ దయానంద రాజు ఉన్నారు.

➡️