ప్రజాశక్తి -ఖాజీపేట ‘ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ తరహా వైద్యం అందిస్తాం.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.’ ఇటువంటి మాటలు మనకు తరచూ విన్పిస్తుంటాయి.. కానీ వాస్తవానికి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇందుకు ఉదాహరణే నిరుపయోగంగా ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్ వివరాలు.. మండలం పరిధిలోని పత్తూరు పంచాయతీ డాంఖాన్పల్లె గ్రామంలో లక్షలు వ్యయం చేసి నూతనంగా డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ కేంద్రం నిర్వించారు. నిర్మించి కొన్ని నెలలవుతున్నా ఇంతవరకూ ప్రారంభించిన పాపాన పోలేదు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడంపై పలువురు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేక విలేజ్ హెల్త్ క్లినిక్ కేంద్రానికి వెళ్తే అక్కడ ఎప్పుడూ మూసి ఉండడంతో ఏమి చేయలేక వెనుదిరిగావాల్సి వస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు. దీంతో ప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో నిర్మించిన హెల్త్ క్లిన్ నిరుపయోగంగా మారింది. నెలకు ఒకటో, రెండు సార్లు మాత్రమే తెరుస్తారని అదీ సకాలంలో తెవరకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వైద్య శాఖ ఉన్నత అధికారులు స్పందించి వైద్య కేంద్రం సకాలంలో తెరిచి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
లక్షలు ఖర్చు చేసి నిర్మించారు.. సేవలు మరిచారు..- నిరుపయోగంగా విలేజ్ హెల్త్ క్లినిక్
