‘లా నేస్తం’ ఉపయోగకరం : జేసీ

ప్రజాశక్తి- ఒంగోలు కలెక్టరేట్‌ : వత్తిలో స్థిరపడటానికి ప్రభుత్వం అందజేస్తున్న ‘వైఎస్‌ఆర్‌ లా నేస్తం’ యువ న్యాయవాదులకు ఎంతో ఉపయోగకరమని సంయుక్త కలెక్టర్‌ కె.శ్రీనివాసులు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లా నేస్తం కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ప్రకాశం భవనం నుంచి సంయుక్త కలెక్టర్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు బ్యాంకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కొత్తగా లా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన యువ న్యాయవాదులు వత్తిలో నిలదొక్కుకోవడానికి వైఎస్‌ఆర్‌ లా నేస్తం పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. మూడేళ్లపాటు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ.60 వేలను రెండు విడతలుగా నగదును వారి బ్యాంకు ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. ప్రస్తుతం 189 మందికి ఈ ఏడాది జూలై నుంచి డిసెంబర్‌ వరకు ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పన మొత్తం రూ.56,70,000 ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. లబ్ధిదారులలో ఎస్‌సిలు 34 మంది, ఎస్‌టిలు 11, బిసిలు 64, ఒసిలు 80 మంది ఉన్నారన్నారు. ఈ పథకం ద్వారా ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు 382 మందికి లబ్ధి కలిగినట్లు జేసీ వివరించారు. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకుని మొదటి మూడు సంవత్సరాలలో వారు వత్తిలో నిలదొక్కుకోవడానికి పడే కష్టాన్ని గుర్తించి దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని యువ లాయర్లు ఉపయోగించుకుని మంచి న్యాయవాదులుగా ఎదిగి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, యువ న్యాయవాదులు పాల్గొన్నారు.

➡️