వైసిపి ఎమ్మెల్యేలకు జంబ్లింగ్‌!

మంగళగిరిలో నిరసన తెలుపుతున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిమానులు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :
ఉమ్మడి జిల్లాలో అధికారపార్టీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. నియోజకవర్గాల్లో ప్రతికూలతలు పెరుగుతుండటం వల్ల వైసిపికి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులకు జంబ్లింగ్‌ విధానం అమలు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో స్థానికంగా వ్యతిరేకత ఉన్న వారిని మరొక నియోజకవర్గానికి పంపుతున్నారు. సామాజిక సమీకరణలు, టిడిపి అభ్యర్థులను ధీటుగా ఎదుర్కొవాలనే వ్యూహరచనతో ఒకేరోజు 8 నియోజకవర్గాల్లో కొత్త ఇన్‌ఛార్జిలను ప్రకటించారు. మరోవారంలో మరికొంతమందిని కూడా ఇదే జంబ్లింగ్‌ పద్ధతిలో మార్పు చేస్తారని వైసిపి వర్గాలు తెలిపాయి. మంగళగిరి నియోజకవర్గానికి ఆప్కో చైర్మన్‌ గంజి చిరంజీవిని ఇన్‌ఛార్జిగా ప్రకటిస్తున్నారని తెలియడంతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేసి కలకలం సృష్టించారు. అంతేగాక ఆళ్ల వైసిపికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో నియోజకవర్గంలో ఆయన అనుచరులు కూడా రాజీనామా బాటపట్టారు. మంత్రి విడదల రజనీని చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ బాధ్యతలు అప్పగించారు. ఈ విషయం ముందే తెలుసుకున్న ఆమె కొంత కాలంగా చిలకలూరిపేటకు దూరంగా ఉంటున్నారు. చిలకలూరిపేటలో ఇటీవల తుపాను సమయంలోనూ ఆమె రైతులను పరామర్శించలేదనే విమర్శలు వచ్చాయి. చిలకలూరిపేట సీటు తనకు రాదని తెలిసి ఆమె గుంటూరులో స్థిరనివాసం కోసం ఇంటి నిర్మాణం కూడా చేపట్టారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి పరిస్థితి డోలాయనంలో పడింది. ఆయనకు ఎక్కడ అవకాశం కల్పిస్తారన్నదీ సందిగ్ధంగామారింది. చిలకలూరిపేటలో వ్యాపార వేత్త మల్లెల రాజేష్‌ నాయుడు ఎంపిక చేయడం ద్వారా సామాజిక సమీకరణపై దృష్టి పెట్టారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో ఆమెకు తాడికొండ బాధ్యతలు అప్పగించారు. తాడికొండలో మూడు రాజధానుల ప్రతిపాదనపై నాలుగేళ్లుగా ఉద్యమం జరుగుతుండటం, రాజధాని మార్పు ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఆమె ఎంత వరకు సఫలీకృతులవుతారన్నదీ ప్రశ్నార్థకంగా మారింది. తాడికొండలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే శ్రీదేవి వైసిపిలో కొనసాగుతున్న సమయంలోనే మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్‌ను అదనపు సమన్వయకర్తగా నియమించారు. అప్పట్లో ఆయన నియామకంపై శ్రీదేవి నిరసన వ్యక్తం చేశారు. రెండు నెలలకే డొక్కాను తొలగించి కత్తెర సురేష్‌కు అవకాశం కల్పించారు. గత మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఉండవల్లి శ్రీదేవిని వైసిపి నుంచి సస్పెండ్‌ చేశారు. ఆ తరువాత ఆమె టిడిపిలో చేరారు. అప్పటి నుంచి కత్తెర సురేష్‌ నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తున్నా ప్రజలలో సానుకూలత రాలేదని సర్వేల్లో తేలడంతో మూడోసారి ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితను ఎంపిక చేశారు. ప్రత్తిపాడులో సుచరిత స్థానంలో ఇన్‌చార్జిగా ఆర్కిటెక్చర్‌, ఎన్‌ఆర్‌ఐ బాలసాని కిరణ్‌కుమార్‌ను నియమించారు. ఆయనకు స్థానికంగా పార్టీతో ఎటువంటి సంబంధాలూ లేవు. కొత్త అభ్యర్థిని రంగ ప్రవేశం చేయిస్తున్నారు. వేమూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మేరుగ నాగార్జునను ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా నియమించారు. వేమూరులో నాగార్జునకు ప్రతికూలత పెరిగింది. నాగార్జున స్థానంలో ప్రకాశం జిల్లా కొండపి ఇన్‌ఛార్జి వరికూటి అశోక్‌బాబుకు వేమూరు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. రేపల్లెకు మాజీమంత్రి ఈపూరు సీతారామమ్మ కుమారుడు డాక్టర్‌ ఈపూరు గణేష్‌కు బాధ్యతలు ఇచ్చారు. ఇక్కడ ఎంపి మోపిదేవి వెంకట రమణకు బాధ్యతల నుంచి తప్పించారు. మొత్తంగా ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థుల ఎంపికలో వైసిపి వేగంగా అడుగులు వేస్తోంది.

➡️