నిరసన తెలుపుతున్న సచివాలయ ఉద్యోగులు
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : సచివాలయ సిబ్బందిపై వైసిపి కౌన్సిలర్ భర్త దాడి చేసిన ఘటన పట్టణంలోని 29వ వార్డు నందు గల 6వ సచివాలయం వద్ద సోమవారం చోటుచేసుకుంది. బాధితుని వివరాల ప్రకారం.. వార్డు సచివాలయంలో ఎమినిటీ సెక్రటరీగా ఫణీంద్ర సచివాలయంలో సంక్షేమ ఫలాల బోర్డు ఏర్పాటు చేస్తున్న క్రమంలో కౌన్సిలర్ భర్త వైసిపి జండా కూడా పెట్టాలని సూచించారు. ఇందుకు సచివాలయ సిబ్బంది అభ్యంతరం తెలపడంతో సెక్రటరీ ఫణీంద్రను కౌన్సిలర్ భర్త దుర్భషలాడారు. ఈ క్రమంలో తోపులాట తలెత్తగా ఈ ఘటనను శానిటేషన్ సెక్రటరీ అశోక్ కుమార్ వీడియో తీస్తున్నారు. దీంతో అశోక్ వద్ద ఫోన్‌ను కౌన్సిలర్ భర్త ఆయన షేక్ సైదావలి లాక్కుని అతని తలపై బలంగా కొట్టడంతో అశోక్‌కు తల పగిలింది. దీనిపై సచివాలయ సిబ్బంది అంతా స్థానిక పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి నిరసన తెలిపి ఫిర్యాదు చేశారు. గతంలో కూడా పిడుగురాళ్ల పట్టణంలోని సచివాలయ సిబ్బందిపై పలుమార్లు స్థానిక నాయకులు దాడులు చేసినా తమకు న్యాయం జరగలేదని సచివాలయ సిబ్బంది రాష్ట్ర నాయకులు అబ్దుల్ రజాక్ తెలిపారు. తమకు న్యాయం జరిగేంతవరకు ఆందోళన చేస్తామన్నారు.
