సమస్యాత్మక కేంద్రాలపై గట్టి నిఘా

ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి/క్రైమ్‌ ”కర్నూలు రేంజ్‌ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో పోలీసు బలగాల ద్వారా గట్టి నిఘాను ఏర్పాటు చేశాం. నాలుగు జిల్లాల పరిధిలో 13 కంపెనీల కేంద్ర పోలీసు బలగాలను ఏర్పాటు చేశాం. రాష్ట్ర, జిల్లాల సరిహద్దుల్లో అక్రమ రవాణా చోటు చేసుకోకుండా చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశాం. ఇప్పటికే పలుచోట్ల నగదును స్వాధీనం చేసుకున్నాం. లైసెన్సుడు గన్నులను డిపాజిట్‌ చేసుకున్నాం. ప్రతి పార్లమెంటు పరిధిలోని స్ట్రాంగ్‌ రూముల వద్ద భద్రతను ఏర్పాటు చేశాం” అని కర్నూలు రేంజ్‌ డిఐజి సిహెచ్‌ విజయరావు తెలిపారు. ప్రజాశక్తి ముఖాముఖిలో ఎన్నికల నిర్వహణ భద్రత ఏర్పాట్లకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు…ఎన్ని పోలీసు కంపెనీ బలగాలను కేటాయించారు?డిఐజి : కర్నూలు రేంజ్‌ పరిధిలోని కర్నూలు, నంద్యాల, వైఎస్‌ఆర్‌ కడప, అన్నమయ్య జిల్లాల పరిధిలో మొత్తం 13 పోలీసు కంపెనీ బలగాలను ఏర్పాటు చేశాం. ఒక్కొక్క జిల్లాకు మూడు కంపెనీల చొప్పున 12 కంపెనీలు కాగా ఒక నంద్యాలకు నంద్యాల జిల్లాకు మాత్రం నాలుగు కంపెనీలను కేటాయించాం. ఆయా జిల్లాల్లో సమస్య ఆత్మక ప్రాంతాలను గుర్తించి కేంద్ర బలగాలతో ఫ్లాగ్‌ మార్చ్‌, కవాతు నిర్వహిస్తున్నాం.సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారా?డిఐజి : కడప జిల్లాలో 513, అన్నమయ్య జిల్లాలో 400, కడప జిల్లాలో 513, నంద్యాల జిల్లాలో 370, కర్నూలు జిల్లాలో 320 కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించాం. అక్కడ ఆర్మూర్‌ రిజర్వుడ్‌ పోలీసు బలగాలతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి పోలింగ్‌ కేంద్రం పరిధిలో ప్రత్యేక రూటు ఆఫీసర్లను ఏర్పాటు చేసి ఆ రూట్లో ఒక వాహనంతో పాటు ఐదుగురు సిబ్బంది ఉంటారు. ఏదైనా ఫోన్‌ కాల్‌ ద్వారా ఫిర్యాదు అందితే వెంటనే అక్కడికి వెళ్లి సమస్యను పరిష్కరిస్తారు. ఫ్యాక్షన్‌ గ్రామాల్లో నేరాల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?డిఐజి : కర్నూలు రేంజ్‌ పరిధిలో కర్నూలు జిల్లాలో 27, నంద్యాల జిల్లాలో 28, కడప జిల్లాలో 67 గ్రామాలను ఫ్యాక్షన్‌ ప్రభావిత గ్రామాలుగా గుర్తించాం. అక్కడ ఫ్యాక్షన్‌ జోన్‌ పరిధిలో ప్రత్యేక ఇన్స్పెక్టర్లను కేటాయించాం. గత పది ఏళ్లలో ఎవరు ఫ్యాక్షన్‌ కార్యకలాపాలను ప్రేరేపిస్తున్నారో గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టిని ఉంచాం. ఎన్‌బిడబ్ల్యులను పూర్తిచేశాం. ఎన్నికల్లో సమస్యలు సృష్టించే వ్యక్తులను ఎమ్మార్వో సమక్షంలో బైండోవర్‌ కేసులను నమోదు చేశాం.ఎన్ని లైసెన్సుడు గన్నులను స్వాధీనం చేసుకున్నారు ?డిఐజి : బ్యాంకుల వద్ద ఉన్న లైసెన్సుడు గన్నులు మినహా అన్ని లైసెన్సుడు గన్నులను స్వాధీనం చేసుకుంటున్నాం. ఇప్పటివరకు కర్నూలు జిల్లాలో 577, నంద్యాల జిల్లాలో 779, కడప జిల్లాలో 678, అన్నమయ్య జిల్లాలో 764 లైసెన్సుడు గన్నులను స్వాధీనం చేసుకున్నాం. స్ట్రాంగ్‌ రూముల వద్ద ఎలాంటి భద్రత చర్యలు తీసుకుంటున్నారు? డిఐజి : పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒకటి చొప్పున ఏర్పాటు చేసే స్ట్రాంగ్‌ రూముల వద్ద మూడు అంచల భద్రత వ్యవస్థతో కట్టుదిట్టం చేస్తున్నాం. మొదటి వ్యవస్థలో కేంద్ర పోలీసు బలగాలు, రెండో వ్యవస్థలో ఏపీఎస్పీ బలగాలను, మూడవ వ్యవస్థలో జిల్లా పోలీసు బలగాలతో కట్టుదిట్టం చేస్తున్నాం. జాయింట్‌ లెవెల్‌ ఆఫీసర్లతో భద్రతను పర్యవేక్షిస్తున్నాం.నాటుసారా తయారీ, మద్యం అక్రమ రవాణాపై ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటున్నారు?డిఐజి : నాలుగు జిల్లాల పరిధిలో ఎక్కడైనా నాటుసారా బట్టీల ఏర్పాటు, తయారీ, రవాణా, రాష్ట్ర ఇతర మద్యం రవాణపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాం. ఎన్ఫోర్స్మెంట్‌ పోలీసులతో దాడులు నిర్వహించి కేసులు కడుతున్నాం. అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులు కర్నూలు జిల్లాలో 8, నంద్యాల జిల్లాలో రెండు, అన్నమయ్య జిల్లాలో ఒకటి ఉన్నాయి. జిల్లా సరిహద్దు చెక్‌పోస్టులు ఒక్కో జిల్లాలో 10 పైగా ఉన్నాయి. చెక్‌ పోస్టుల్లో నగదును, అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సీజ్‌ చేస్తున్నాం. కర్నూలు జిల్లాలో రూ.2.45 కోట్లు, నంద్యాల రూ 37 లక్షలు, కడప రూ.10.71 కోట్లు, అన్నమయ్య జిల్లాలో దాదాపు రూ.37 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నాం. లిక్కర్‌ కేసులు కడపలో 1000 పైగా, కర్నూలు 360, నంద్యాల 250, అన్నమయ్య 650 పైబడి కేసులు నమోదు చేశాం. ఇప్పటి వరకు సి-విజిల్‌ యాప్‌లో 80 ఫిర్యాదులు నాలుగు జిల్లాల పరిధిలో అందగా వాటిని ఆయా జిల్లాలో ఎస్పీలు పరిష్కరిస్తున్నారు. నంద్యాల జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఒక షాడో జోన్‌ ఉంది. కర్నూలు రేంజ్‌ పరిధిలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లో రోడ్డు, ఫోన్‌ కమ్యూనికేషన్‌ ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు ఎవరు విఘాతం కలిగించినా కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలి.

➡️