సమ్మె ఆరంభం

గుంటూరు సమ్మె శిబిరంలో అంగన్‌వాడీలు
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా :
అంగన్‌వాడీలకు కనీస వేతనాలు అమలు చేయాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మంగళవారం నుండి సమ్మె ప్రారంభమైంది. సమ్మెతో అంగన్‌వాడీ కేంద్రాలు పూర్తిగా మూతపడ్డాయి. గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట ఏర్పాటు చేసిన సమ్మె శిబిరానికి గుంటూరు నగరంలోని కార్యకర్తలు, ఆయాలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఆందోళన చేపట్టారు. సమ్మెకు సిపిఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చాంద్‌బాషా, ఎపిఎన్‌జిఒ నాయకులు మూర్తి, ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి చిష్టీ, సిఐటియు నాయకులు కె.శ్రీనివాస్‌, బి.ముత్యాలరావు తదితరులు సంఘీభావం తెలిపారు. పేద గర్భిణులు, శిశువులకు సేవలు అందిస్తున్న అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వ చిన్నచూపు తగదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. సమ్మెకు ఆయా సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణం స్టేషన్‌రోడ్‌లోని గాంధీపార్క్‌ వద్ద నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేసి ఆర్డీవో ఎం.శేషిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఆందోళనకు టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు మద్దతు తెలిపారు. గుంటూరులో నిరసనకు ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) నగర కార్యదర్శి టి.రాధ అధ్యక్షత వహించగా నరసరావుపేటలో ఆందోళనకు యూనియన్‌ పల్నాడు జిల్లా అధ్యక్షులు కెపి మెటిల్డా దేవి అధ్యక్షత వహించారు. గుంటూరు, పల్నాడు జిల్లాల ప్రధాన కార్యదర్శులు దీప్తి మనోజ, గుంటూరు మల్లీశ్వరి మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారానికి నాలుగున్నరేళ్లుగా అనేక సార్లు, పలు రూపాల్లో ప్రభుత్వానికి విన్నివించినా పట్టించుకోలేదన్నారు. సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత చర్చలకు పిలిచి, డిమాండ్లు ఏవీ అంగీకరించలేమంటూ చేతులెత్తేశారని, అనివార్యంగా సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని వివరించారు. సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులంటూ సంక్షేమ పథకాలనూ వర్తింపచేయడం లేదని, మరోవైపు కనీస వేతనాలు అమలు చేయకుండా గౌరవ వేతనాల పేరుతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని విమర్శించారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ను రద్దు చేయాలన్నారు. సుప్రీం కోర్టు అంగన్‌వాడీలకు గ్రాట్యుటీ ఇవ్వాలని తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. రాధా మాట్లాడుతూ నెలల తరబడి వేతనాలు, బిల్లులు పెండింగ్‌లో ఉంచటం వల్ల కేంద్రాల నిర్వహణ భారం అంగన్‌వాడీలపై పడుతుందన్నారు. మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చటానికి అవసరమైన ఫైలు ఏళ్ల తరబడి ఉన్నతాధికారుల వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ నుండి అంగన్‌వాడీలకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చిన్న చిన్న సమస్యలనూ పరిష్కరించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటన్నారు. సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయ నాయక్‌ మాట్లాడుతూ మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్‌ గా గుర్తించాలని, పెండింగ్లో ఉన్న సెంటర్‌ అద్దెలు, కరెంటు బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఎఐటియుసి నాయకులు హెల్డా ఫ్లారిన్‌ మాట్లాడుతూ మాత శిశు సంరక్షణకు పాటుపడుతున్న అంగన్వాడీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమన్నారు. డాక్టర్‌ చదలవాడ మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి రాగానే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. గుంటూరులో సిఐటియు నాయకులు ఎ.నికల్సన్‌, ఖాశింవలి, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు చిన వెంకాయమ్మ, పద్మ, రమణ, వేదవతి, నరసరావుపేటలో సిఐటియు మండల అధ్యక్షులు షేక్‌ సిలార్‌ మసూద్‌, నాయకులు నిర్మల, ప్రసన్న, ఎఐటియుసి నాయకులు రాంబాబు, రంగయ్య, వెంకట్‌ అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️