స్నేహితుడికి తోడుగా వెళ్లి…రోడ్డు ప్రమాదంలో ‘పది’ విద్యార్థి మృతి

ప్రజాశక్తి-బి.కొత్తకోట రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…తండ్రికి భోజనం ఇచ్చి, ఫైనల్‌ పరీక్షకు వెళ్లవచ్చులే అని వెంకటేష్‌ భావించి తన తోటి స్నేహితుడు సాయి చరణ్‌ని వెంటబెట్టుకొని మలకలచెరువు మండలంలోని చీకటిమారేపల్లికి ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. అల్లనేరేడు చెట్ల వ్యవసాయం చేస్తుండడంతో తండ్రి భోజనం బస్సులో పెట్టి పంపించమని ఇంట్లో చెప్పడంతో ద్విచక్ర వాహనంలో వెళ్లి ఇచ్చేసి రావచ్చని ఉద్దేశంతో వారు బయలుదేరి వెళ్తుండగా పిటిఎం మండలం కాట్నగల్లు గ్రామానికి చెందిన నరసింహులు, శ్యామ్‌ కాట్నగల్లు నుంచి గ్యాస్‌ సిలిండర్‌ తెచ్చుకునేందుకు పిటిఎంకు ద్విచక్ర వాహనంలో వస్తుండగా మద్దయ్యగారిపల్లి పంచాయతీ సమీపంలోని కుమ్మరవారిపల్లి వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢకొీన్నాయి. బి.కొత్తకోట పట్టణంలో కాపురముంటున్న పిటిఎం మండలంలోని పోతుపేట గ్రామానికి చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటరమణ కుమారుడు సాయి చరణ్‌(15)కు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్లు మదనపల్లి జిల్లా ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయి చరణ్‌ తండ్రి ఉద్యోగ రిత్యా మలకలచెరువు పోలీసుస్టేషనులో హెడ్‌కానిస్టేబులుగా విధులు నిర్వహిస్తున్నారు. కాట్నగల్లు నుంచి గ్యాస్‌ సిలిండర్‌ కోసం పిటిఎం వస్తున్న వారిలో నరసింహులు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడ్డ వెంకటేష్‌కు చేయి, కాలు విరిగినట్లు డాక్టర్లు తెలిపారు. మరో వ్యక్తి శ్యామ్‌కు గాయాలైనట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై పిటిఎం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బి.కొత్తకోట పట్టణంలోని శ్రీ చైతన్య చిల్డ్రన్స్‌ అకాడమీ స్కూల్‌లో సాయిచరణ్‌, వెంకటేష్‌ ఇద్దరు పదవ తరగతి చదువుతున్నట్లు బంధువులు తెలిపారు. సాయిచరణ్‌ ప్రతిభ కలిగిన విద్యార్థి అని పాఠశాల ప్రిన్సిపల్‌ కేశవరెడ్డి తెలిపారు. డాక్టర్‌ కావాలని వారి తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారని మెరిట్‌ స్టూడెంట్‌ మృతి చెందడం దురదృష్టకరమని స్కూల్‌ ప్రిన్సిపల్‌ కేశవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు.

➡️