విజయవాడ రూరల్ (ఎన్‌టిఆర్) : విజయవాడ రూరల్ మండలం పాతపాడు, మంగళాపురం, సీతారాంపురం గ్రామాలకు చెందిన ఉపాధి కూలీలు దాదాపు పది కిలోమీటర్లు అడవి ప్రాంతంలోకి వెళ్లి ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం యన్టీఆర్ జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్ అడవిలో జరుగుతున్న ఉపాధి హామీ పని ప్రదేశాన్ని సందర్శించి కూలీల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉపాధి కూలీలు దాదాపు పది కిలోమీటర్లు వెళ్లి అడవి ప్రాంతంలో మండుటెండలో పనిచేసినా కూలీలకు రోజు వారి కూలి గిట్టుబాటు కావడం లేదని అన్నారు. దాదాపు 200రూ.లు మాత్రమే కూలీ వేతనం అందుతుందని అన్నారు. వేసవికాలం కావడం వలన భూమి గడ్డపార పారలకు తెగకపోవడంతో ప్రభుత్వం ఇచ్చిన కొలతల ప్రకారం కూలి పడటం లేదని అన్నారు. ఉపాధి కూలీలు ఇంటికి వెళ్లేసరికి మిట్ట మధ్యాహ్నం అవుతుందని ఎండంత కూలీల మీదనే పోతుందని దీనివల్ల వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పని ప్రదేశాల్లో కనీసం మంచినీళ్లు, మెడికల్ కిట్స్ లేవని పాలకులు ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా స్పందించి కొలతలతో సంబంధం లేకుండా కనీస రోజువారి వేతనం 600 రూపాయలు ఇచ్చి పని దినాలను 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉపాధి కూలీలతో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దుర్గారావు పెద్ద ఎత్తున ఉపాధి మేట్లు కూలీలు పాల్గొన్నారు.
10 కిలోమీటర్లు వెళ్లి పని చేసినా గిట్టుబాటు కాని ఉపాధి కూలి..!
