వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ సతీష్‌కుమర్.. వెనక ముసుగుల్లో నిందితులు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బిఇడి పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకేజి కేసులో 10 మందిని పెదకాకాని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ కథనం ప్రకారం… ఈనెల 7వ తేదీన జరిగిన ‘పర్‌స్పెక్టివ్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్’ ప్రశ్నాపత్రం పరీక్షకు అరగంట ముందే సోషల్ మీడియాలో రావడంతో వర్సిటీ ఎగ్జామినేషన్ కో-ఆర్డినేటర్ మన్నవ సుబ్బారావు పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిఐ నారాయణ స్వామి దర్యాప్తు చేయగా ఒరిస్సాకు చెందిన నలుగురు బిఇడి కోచింగ్ సెంటర్స్‌ను పెట్టుకుని, పలువురితో పరీక్షలను రాయిస్తూ, వారికి ఎక్కువ మార్కులు వచ్చేలాగా చేయడం కోసం ప్రశ్నాపత్రం లీక్ చేసినట్టు తేలింది. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచి తద్వారా ఎక్కువ మందిని తమ కోచింగ్ సెంటర్ వైపు ఆకర్షించు నిమిత్తం వినుకొండ శ్రీ వివేకానంద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థ కరస్పాండెంట్ డైరెక్టర్ సయ్యద్ రఫీక్ అహ్మద్ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుని, ఆ సంస్థ ద్వారా విద్యార్థులను బిఇడి పరీక్షలు రాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 7న ప్రశ్నాపత్రాన్నీ లీక్ చేసి వాటిని సామాజిక మాధ్యమం ద్వారా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారికి పంపించారు. ఈ కేసులో వినుకొండలోని శ్రీ వివేకానంద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థకు చెందిన వారిని, ఒరిస్సాకు చెందిన వారిని మ్తొంగా 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో సయ్యద్ రఫిక్ అహ్మద్, దుపాటి సురేష్ కుమార్, ధార స్వర్ణరాజ్, సంతోష్ కుమార్ సాహు, బిష్ణు ప్రసాద్ పాత్రో, సుకాంత్. బెహెరా, పురుషోత్తం ప్రదాన్, ధీరేన్ కుమార్ సాహు, ప్రియబత్రో గోడరు, మిలాన్ తష్టి ఉన్నారు. నార్త్ డిఎస్‌పి మురళీకృష్ణ ఆధ్వర్యంలో సిఐ నారాయణ స్వామి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
