ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరులో ఇఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి కేంద్ర కార్మిక శాఖ పచ్చజెండా ఊపింది. 100 ఆస్పత్రి నిర్మాణానికి ఇఎస్‌ఐ జనరల్ బాడీ సమావేశంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నిర్ణయం తీసుకున్నారు. గుంటూరులో ఇఎస్‌ఐ ఆసుపత్రి కోసం కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గతంలో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం భూసేకరణకు కూడా అనుమతిచ్చారు. గుంటూరు జిల్లాలోని మిర్చి యార్డ్, స్పిన్నింగ్ మిల్స్, కోకాకోల కంపెనీ తదితర పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఈ ఆస్పత్రి ఎంతో ఉపయోగపడుతుందని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ప్రస్తుతం గుంటూరులో ఇఎస్‌ఐ డిస్పెన్సరీ మాత్రమే ఉండడంతో వైద్య అవసరాల కోసం విజయవాడ వెళ్లాల్సి వస్తోంది. గుంటూరులోనే 100 పడకలతో ఆస్పత్రి నిర్మిస్తే ఇక్కడే ఇన్‌పేషెంట్ వార్డులు కూడా నెలకొల్పవచ్చని మంత్రి తెలిపారు. జిల్లాలో దాదాపు 50 వేల మంది కార్మికులకు ఈ ఆస్పత్రి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
