గుంటూరుకు 100 విద్యుత్‌ బస్సులు

Mar 10,2025 00:21

బస్టాండ్‌లో పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి చంద్రశేఖర్‌ తదితరులు
ప్రజాశక్తి-గుంటూరుజిల్లా ప్రతినిధి :
త్వరలో 100 విద్యుత్‌ బస్సులు గుంటూరుకు రానున్నాయని కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్‌ శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ బస్సులకు ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 200 కిలో మీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చని అన్నారు. పిపిపి పద్ధతిన వైబిలిటీ గ్యాప్‌ ఇచ్చి కిలోమీటర్‌కు రూ.25 కంటే తక్కువ ఆదాయం వస్తే మిగతా నష్టం కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. గుంటూరులోని ఎన్టీఆర్‌ బస్టాండ్‌ను ఆదివారం పరిశీలించిన ఆయన మాట్లాడుతూ ఒకేసారి 100 విద్యుత్‌ బస్సులను నిర్వహించాలంటే ఒక ప్రత్యేకమైన విద్యుత్‌ ఛార్జింగ్‌ సదుపాయాలు కావాలని, సుమారు 5 ఎకరాల స్థలంలో ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణకు, ఛార్జింగ్‌ ప్రాంతాలతో కూడిన కొంత స్థలం అవసరమని, ఇందుకోసం అధికారులతో చర్చించామని తెలిపారు. ఆర్‌టిసి చైర్మన్‌ చైర్మన్‌ కొనకళ్ల నారాయణతో కూడా ఈ అంశంపై చర్చించినట్టు చెప్పారు. ప్రస్తుతం గుంటూరులోని ఎన్‌టిఆర్‌ బస్టాండ్‌లో ఉన్న గ్యారేజిని మరో ప్రాంతానికి తరలించి ఎలక్ట్రిక్‌ నిర్వహణ కోసం గ్యారేజి స్థలాన్ని వినియోగించే ఆలోచన ఉందన్నారు. ఖాళీ స్థలాలను ఉపయోగించి ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచే ప్రణాళికలను రూపొందిస్తున్నామని తెలిపారు. మంగళగిరికి కూడా త్వరలో విద్యుత్‌ బస్సులు వస్తాయన్నారు. అంతకు ముందు ఆయన బస్టాండ్‌లో వసతులన పరిశీలించారు. బస్టాండ్‌ పేద వాళ్లకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన రవాణా మార్గమని, ఇలాంటి రవాణా మార్గాన్ని ఆత్యాధునిక సౌకర్యాలతో టాయిలెట్స్‌, తదితర అవసరాలతో పాటు ఆదాయ మార్గాలకు కూడా అవకాశం కల్పిస్తూ ఏర్పరిచేలా కృషి చేస్తామని అన్నారు. అనంతరం ఆర్టీసీ కార్గో సర్వీసులు కౌంటర్లను పరిశీలించి అక్కడి వినియోగదారులతో మాట్లాడారు. బుకింగ్‌ సేవలలో ఏదైనా లోపాలుంటే తొలగిస్తామన్నారు. బుకింగ్‌ కౌంటర్లు తక్కువగా ఉండటం వల్ల బుకింగ్‌లకు ఎక్కువ సమయం పడుతుందని, ఎండల్లో వచ్చేవారు గంటల తరబడి నిలబడాల్సి వస్తుందని ఫిర్యాదు చేశారు. మంత్రి స్పందిస్తూ పార్సిల్‌ సర్వీస్‌ కాంట్రాక్టర్‌ను పిలిచారు. అదనపు బుకింగ్‌ కౌంటర్లను వెంటనే ఏర్పాటు చేయాలని, బుకింగ్‌ చేసుకోవడానికి వచ్చే ప్రజల కోసం కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్‌ నసీర్‌ అహ్మద్‌, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ, జిఎంసి డిప్యూటీ మేయర్‌ షేక్‌ సజీలా, ఆర్టీసీ ఈడీ నాగేంద్రప్రసాద్‌, ఇడిఇ రవి వర్మ, జిల్లా ప్రజా రవాణా అధికారి రవికాంత్‌, గుంటూరు-2 డిపో మేనేజర్‌ అబ్దుల్‌ సలాం పాల్గొన్నారు.

➡️