1వ తేదీనే 100 శాతం పింఛన్లు పంపిణీ కావాలి : జిల్లా కలెక్టర్‌ పి అరుణ్‌ బాబు

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : జిల్లాలోని పింఛనుదారులందరికీ ఆగస్ట్‌ 1వ తేదీనే 100 శాతం పింఛన్లు పంపిణీ కావాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు.అందుబాటులో లేని లబ్ధిదారులకు 2 వ తేదీన పింఛన్లు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌ లో పింఛన్ల పంపిణీపై జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1,2 తేదీల్లో మొత్తం పింఛన్లు పంపిణీ కావాలని, ఈ విషయాన్ని ప్రతి గ్రామం, వార్డులో ముందస్తు ప్రచారం చేపట్టాలని అన్నారు. పింఛను డబ్బులను ఈ నెల 31న డ్రా చేసి సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఆగస్ట్‌ 1వ తేదీ ఉదయం 5.00గం.ల నుంచి పింఛన్లు పంపిణీ కావాలని కలెక్టర్‌ తేల్చి చెప్పారు. అధిక శాతం పింఛనుదారులు ఒకే బ్యాంకు నుంచి పింఛను పొందడం వలన, పింఛను పొందడంలో కాస్త జాప్యం జరిగే అవకాశం ఉందని, అటువంటి సమస్య లేకుండా తమ సమీప బ్యాంకు నుంచి లబ్ధిదారులు పింఛనును పొందేలా తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. మండల ప్రత్యేక అధికారులు పెన్షన్‌ పంపిణీలో పాల్గొనాలన్నారు.ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి కె.వినాయకం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు డి.ఎల్‌.డి.ఓ ,ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️