13 నుంచి టిడిపి శంఖారావం

Feb 10,2024 21:17

ప్రజాశక్తి-విజయనగరం కోట :  టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ తలపెట్టిన శంఖారావం కార్యక్రమం ఈనెల 13 నుంచి 16వరకు నాలుగు రోజులు పాటు ఉమ్మడి జిల్లాలో జరుగుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున తెలిపారు. ఈ సభలను టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు జయప్రదం చేయాలని కోరారు. శనివారం అశోక్‌బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ కార్యక్రమం ఏర్పాట్లు గురించి వివరించారు. రాష్ట్రంలో మెజారిటీ నియోజకవర్గాల్లో యువగళం పేరుతో లోకేష్‌ చేపట్టిన పాదయాత్ర కార్యకర్తలకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చిందన్నారు. ఆ పాదయాత్ర ఇచ్చాపురం వరకు వెళ్లి అక్కడ ముగింపు పలకవలసి ఉండగా చంద్రబాబు అక్రమ అరెస్టుతో రెండు నెలలు విలువైన సమయం పోయిందన్నారు. పాదయాత్ర సమయంలో వెళ్లలేని నియోజకవర్గాల్లో శంఖారావం పేరిట సభలు పెడుతున్నట్లు తెలిపారు. అయితే ఈ కార్యక్రమం రోడ్‌ షో గాని, భారీ బహిరంగ సభలు గాని ఉండబోవని, నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో ఉండే సాధికారత కుటుంబాలు మిత్రులు ఎవరైతే ఉన్నారో వారితో సమావేశాలు నిర్వహిస్తారని తెలిపారు. ఉమ్మడి జిల్లాల్లో 13వ తేదీ మధ్యాహ్నం పాలకొండలో సభను ముగింపు చేసుకుని ఆరోజు సాయంత్రం కురుపాం నియోజకవర్గానికి వస్తారన్నారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సభలు ఉంటాయన్నారు, 14న ఉదయం పార్వతీపురం, మధ్యాహ్నం సాలూరు, సాయంత్రం బొబ్బిలిలో సభలు నిర్వహించి రాత్రికి రాజాంలో బస చేస్తారని తెలిపారు. 15వ తేదీ ఉదయం రాజాం, మధ్యాహ్నం చీపురుపల్లి, సాయంత్రం ఎచ్చెర్లలో సభలు నిర్వహించుకుని రాత్రి నెల్లిమర్లకు చేరుకొని బసచేస్తారని తెలిపారు. 16న ఉదయం నెల్లిమర్ల, మధ్యాహ్నం విజయనగరం, సాయంత్రం గజపతినగరం నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తామన్నారు. 16న రాత్రి ఎస్‌.కోట చేరుకొని రాత్రి అక్కడ బసవేసి మరుసటి రోజు 17వ తేదీ ఉదయం సభను నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం అక్కడి నుంచి అనకాపల్లి జిల్లాకు చేరుకుంటారన్నారు. విజయనగరం నియోజకవర్గ ఇన్చార్జ్‌ అదితి విజయలక్ష్మి , నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలనకు వ్యతిరేకంగా సమర శంఖారావాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, కార్యాలయ కార్యదర్శి రాజేష్‌ బాబు, రాష్ట్ర బిసి నాయకులు వేచలపు శ్రీనివాసరావు, మాడుగుల పరిశీలకులు కర్రోతు నర్సింగ రావు, కంది మురళీనాయుడు, కనకల మురళీమోహన్‌, విజ్జపు ప్రసాద్‌, ముద్దాడ చంద్రశేఖర్‌, ఎ.ఎ.రాజు, కోండ్రు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

➡️