కదిరిలో 13 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

ప్రజాశక్తి-కదిరి టౌన్‌ (సత్యసాయి) : శ్రీసత్యసాయి జిల్లా కదిరి అటవీశాఖ అధికారులు గుఱ్ఱప్ప ఆధ్వర్యంలో 13 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా అటవీశాఖ జిల్లా అధికారి రవీంద్ర రెడ్డి ఆదేశాల మేరకు నల్లచెరువు మండలం పెద్దఎల్లంపల్లి వద్ద కదిరి మదనపల్లి రహదారి పై అటవీ అధికారులు వాహనాల తనిఖీ చేస్తుండగా, మదనపల్లి నుండి కదిరి వైపు వస్తున్న కెఎ 19 3234 నంబరు ఉన్న వాహనాన్ని అధికారులు గుర్తించారు. అధికారుల తనిఖీలను గమనించిన దుండగులు వెంటనే వాహనాన్ని దూరంగా ఆపేశారు. అక్కడి నుండి ఇద్దరు దుండుగులు పరారయినట్లు అటవీ శాఖ అధికారి గుర్రప్ప తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ రూ.2 లక్షలు పైన ఉంటుందని చెప్పారు. వాహనం నెంబర్‌ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్‌ అధికారి రామచంద్ర నాయక్‌, సెక్షన్‌ అధికారీ రామచంద్ర రెడ్డి, ఎఫ్‌ బి ఓ లు నాగరాజు, హరి ప్రసాద్‌, సుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు.

➡️